వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఆ ఒక్క కండిషన్‌పై ఉద్యోగులు రెడీ!

12 Aug, 2021 11:54 IST|Sakshi

వర్క్‌ఫ్రమ్‌ హోం-ఆఫీస్‌ వ్యవహారంలో టెక్‌ కంపెనీలు-ఉద్యోగుల మధ్య హైడ్రామా నడుస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ రేటు పెరుగుతుండడంతో ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీలు అడుగుతుంటే.. ఉద్యోగాలైనా వదిలేసుకుంటాం తప్ప రాబోమంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగారు ఉద్యోగులు. ఈ తరుణంలో కంపెనీలు మాత్రం మొండిపట్టు వీడడం లేదు. ఒకవేళ రిమోట్‌ వర్క్‌కే పట్టుబడితే కట్టింగ్‌లు తప్పవని ఉద్యోగులకు కరాఖండిగా చెప్పేశాయి కూడా. ఈ తరుణంలో ఉద్యోగుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. 
 

వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగించిన నేపథ్యంలో.. జీతాల కట్టింగ్‌కు తాము సిద్ధమేనని గూగుల్‌ ఉద్యోగులు బదులిచ్చారు. శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోంకి అనుమతి ఇస్తే.. కట్టింగ్‌లపై తమకూ ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని, కాకపోతే పర్‌ఫార్మెన్స్‌ ఆధారంగా ఏడాదికి ఒకసారి ఇచ్చే హైకులను మాత్రం కొనసాగించాలంటూ వేల మంది ఉద్యోగుల నుంచి రిప్లై మెయిల్స్‌ వెళ్తున్నాయి గూగుల్‌కి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కండిషన్స్‌కు కంపెనీ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాబ్‌ లొకేషన్‌, కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధారంగా లొకేషన్‌ టూల్‌ జీతభత్యాల చెల్లింపునకు గూగుల్‌ సిద్ధపడుతుండగా.. అందుకు కూడా తాము సిద్ధమేనని సమ్మతి తెలిపారు ఉద్యోగులు. 

ఇది చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం: అమెజాన్‌ నిర్ణయం ఇది

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కి సుమారు లక్షా 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో గతంలో చాలామంది వర్క్‌ఫ్రమ్‌ హోం రిక్వెస్ట్‌లు పెట్టుకోగా.. కేవలం గత రెండు నెలల్లోనే సుమారు పది వేల మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అర్జీలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో 85 శాతం మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతి ఇవ్వాలని గూగుల్‌ నిర్ణయించుకుంది. అలాగే వర్క్‌ ఫ్రమ్‌ హోం, రీ లొకేషన్‌ విజ్ఞప్తులు తిరస్కరణకు గురైన ఉద్యోగులు.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా గూగుల్‌ నిర్ణయించింది. ఇక గూగుల్‌ నుంచి ఈ స్పందన వచ్చిన వెంటనే.. మరికొన్ని టెక్‌ కంపెనీలు కూడా ఇదే బాట పట్టగా.. ఉద్యోగుల నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. 

ఇదీ చదవండి: ఆఫీసులకు వెళ్తేనే కదా అసలు మజా!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో పని భారం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్‌ భయం, ఉద్యోగాల్లో అభద్రతా భావం, ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపే వీలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, డబ్బు సేవింగ్స్‌,  ఇతర పనులు చక్కబెట్టుకునే వీలు!.. తదితర కారణాలతో కట్టింగ్‌లు అయినా సరే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’కే ఉద్యోగులు మొగ్గుచూపిస్తున్నారు. ఇక డెల్టా వేరియెంట్‌ విజృంభణతో ‘వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ను అక్టోబర్‌ 18 వరకు వాయిదా వేశాయి గూగుల్‌, యాపిల్‌ సహా ఇతరత్రా టెక్‌ కంపెనీలు.

మరిన్ని వార్తలు