ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం!

13 Jan, 2022 14:05 IST|Sakshi

కరోనా మహమ్మారి ముచ్చటగా మూడోసారి కూడా కోరలు చాస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో రోజుకు రెండు లక్షల కేసులు రావడం గమనార్హం. దేశంలో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండంతో ఈ కొత్త సంవత్సరంలో కూడా ఐటీ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ నుంచి ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వరకు ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయలని అభ్యర్థించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా చాలా ఐటీ సంస్థలు జనవరి నుంచి 50-70 శాతం సిబ్బందితో ఆఫీస్ ఓపెన్ చేయలని ఇంతకు ముందు నిర్ణయించాయి. అయితే, కొత్త కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ రాకెట్ వేగంతో పెరుగుతుండటంతో దేశ రాజధానితో సహా వివిధ రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎమ్ఏ) జనవరి 11న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని ప్రైవేటు ఆఫీసులు మూసివేయాలి. కార్యాలయాల్లో కేవలం అత్యవసరమైన విధులకు మాత్రమే కంపెనీలు పనిచేయాలని డీడీఎమ్ఏ సూచించింది. మిగిలిన వారికి రిమోట్ వర్క్ సదుపాయాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. 

ఒకే బాటలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్..
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గత నెలలో తన ఉద్యోగులలో 90 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారని తెలిపింది. మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కుటుంబాలు, క్లయింట్ల ఆరోగ్యం & భద్రతను దృష్టిలో ఉంచుకొని అందరినీ ఇంటి నుంచి పనిచేయాలని హెచ్‌సీఎల్ సూచించింది. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడానికి ముందు కోవిడ్-19 వేరియెంట్ల విజృంభిస్తుండటంతో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ పేర్కొంది.

దేశంలో మారుతున్న కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా దాదాపు వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో ఎకనామిక్ టైమ్స్ కు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగి, ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గి, వ్యాక్సినేషన్ పుంజుకున్న తర్వాత బహుశా అప్పుడు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని తను స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు తన ఉద్యోగులలో 50 శాతం మంది సెక్రటరీ స్థాయికి దిగువన గల ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించింది. అంగవైకల్యం ఉన్న వ్యక్తులు, గర్భిణీ మహిళా ఉద్యోగులకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కార్యాలయంలో భారీగా రద్దీ ఉండకుండా టైమింగ్స్ మార్చినట్లు స్పష్టం చేసింది. కార్యాలయంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని కోవిడ్ నియమాలను తప్పనిసరి చేసింది. 

మరిన్ని వార్తలు