2022–23లో భారత్‌ వృద్ధి 6.5 శాతమే!

7 Oct, 2022 08:23 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ ఎకానమీ 2022–23 వృద్ధి అంచనాలకు ప్రపంచబ్యాంక్‌ ఒక శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. జూన్‌లో వేసిన తొలి అంచనా 7.5 శాతాన్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలను దీనికి కారణంగా చూపింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌ వార్షిక సదస్సు నేపథ్యంలో దక్షిణ ఆసియా ఆర్థిక అంశాలపై విడుదలైన నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయపడింది.

మహమ్మారి సవాళ్ల నుంచి, తీవ్ర క్షీణత నుంచి ఎకానమీ బయటపడిందని ప్రశంసించారు. దక్షిణాసియాకు సంబంధించి ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ హన్స్‌ టిమ్మర్‌ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిలో కొన్ని... 

భారీ అంతర్జాతీయ రుణ భారాలు లేవు. అటువైపు నుంచి సవాళ్లు ఏమీ లేవు. పటిష్ట ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తోంది.  

సేవలు, సేవలు రంగాల ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతును ఇస్తున్నాయి.  

అంతర్జాతీయ ప్రతికూల అంశాలే వృద్ధి రేటు తాజా తగ్గింపునకు కారణం.  

ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  

డిజిటల్‌ ఆలోచనలన ఉపయోగించుకుని సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడంలో మిగిలిన ప్రపంచ దేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలుస్తోంది.  

గోధుమల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతులపై అధిక టారిఫ్‌ల విధింపు వంటి ప్రభుత్వ చర్యలను సమర్థింలేం. స్వల్పకాలంలో అవి దేశీయంగా ఆహార భద్రతకు దారితీసినా, దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విధానాలు ప్రతికూలతకు దారితీయవచ్చు.  

కార్మిక మార్కెట్, ఎకానమీలో మరింతమంది ప్రజలను భాగస్వాములుగా చేయడం భారత్‌ తక్షణ అవసరం. 

మరిన్ని వార్తలు