వరల్డ్‌ బ్యాంక్‌ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్‌.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు!

24 Mar, 2023 15:42 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు కాబోయే అధ్యక్షుడు (అమెరికన్‌ నామినీ) భారతీయ అమెరికన్ అజయ్ బంగా‌కు కోవిడ్‌ సోకింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్‌ బంగా ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా చేసిన రొటీన్‌ పరీక్షల్లో ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అజయ్‌ బంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. 

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌ వచ్చిన అజయ్‌ బంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే కోవిడ్‌ సోకడంతో ఆ సమావేశాలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

అజయ్‌ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో భారత్‌ సందర్శన చివరిది. ఆఫ్రికా నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. తన గ్లోబల్ లిజనింగ్ టూర్‌లో బంగా.. ఆయా ప్రాంతాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, వ్యాపార నాయకులు, వ్యవస్థాపకులు, పౌర సమాజంతో సమావేశమవుతూ వస్తున్నారు.

దేశంలో గత కొద్ది రోజులుగా ఇన్‌ఫ్లూయెంజాతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీల కేసులు 7,026కి పెరిగాయి.

మరిన్ని వార్తలు