భారత్‌కు కీలక సంస్కరణలే శరణ్యం

8 Oct, 2020 16:49 IST|Sakshi

ఈ ఏడాది వృద్ధి రేటు 9.6 శాతం క్షీణత : ప్రపంచ బ్యాంక్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌-19 ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్‌ కీలక సంస్కరణలను కొనసాగించాలని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్‌ విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని, 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. ఇక దక్షిణాసియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మార్చితో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.6 శాతం క్షీణిస్తుందని పేర్కొంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ తిరిగి పుంజుకుని 5.4 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక వెల్లడించింది. కోవిడ్‌-19 నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని అంచనా వేసింది. ఇక కోవిడ్‌-19 ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని పేర్కొంది. చదవండి : కోవిడ్‌-19 : ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుంది..?

భారత్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా పరిస్థితి మరింత దిగజారిందని ప్రపంచ బ్యాంక్‌, దక్షిణాసియా ముఖ్య ఆర్థికవేత్త హన్స్‌ టిమర్‌ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడే కోవిడ్‌-19 విరుచుకుపడిందని అయితే సత్వర సమగ్ర చర్యలతో భారత్‌ ఈ విపత్తును అధిగమించవచ్చన్నారు. భారత్‌ దూరదృష్టితో కూడిన సంస్కరణలను చేపట్టిన ఫలితంగా పేదరికంపై సాధించిన విజయాలను సంరక్షించుకోగలుగుతోందని ప్రపంచ బ్యాంక్‌లో భారత్‌ డైరెక్టర్‌ జునైద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. భారత్‌లో సామాజిక భద్రతా చట్టాలకు తీసుకువచ్చిన సవరణలతో గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో సాయం పొందని వర్గాలు ఇప్పుడు ఆయా పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నాయని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు