World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..

11 Aug, 2022 00:57 IST|Sakshi

పెట్రోల్‌–ఇథనాల్‌ మిశ్రమంతో విదేశీ మారకం ఆదా

ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

పానిపట్‌: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్‌లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్‌ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు.

దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్‌ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు.  

2023 ఏప్రిల్‌ నుంచి 20% ఇథనాల్‌ మిశ్రమం
వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి 20% ఇథనాల్‌ మిశ్రమంతో పెట్రోల్‌ను ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది.

మరిన్ని వార్తలు