దావోస్‌ సదస్సుపై ఒమిక్రాన్‌ నీడ!

21 Dec, 2021 09:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌  ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్‌ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సోమవారం తెలిపింది. 

స్విట్జర్లాండ్‌ దావోస్‌లోని స్విస్‌ ఆల్పైన్‌ స్కీ రిసార్ట్‌లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు,పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారు. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం 2020 జనవరిలో  దావోస్‌ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. 

పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం  ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ–  వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్‌ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్‌ భయాలతో 2022 సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈఓలుసహా దాదాపు 100కిపైగా భారత్‌ నుంచి 2022 సదస్సులో పాల్గొనడానికి తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు.  

మరిన్ని వార్తలు