ఈ రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాలు అవసరం: ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే

31 Jan, 2023 15:12 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్‌టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్‌ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్‌ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది.

కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్‌కేర్‌లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది.

చదవండి: అదానీకి మరో షాక్‌.. ఒకదాని తర్వాత మరొకటి, 3 రోజుల్లోనే

మరిన్ని వార్తలు