సూపర్‌ ట్రాక్టర్‌.. ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే!

5 Feb, 2023 10:33 IST|Sakshi

గోమయమే ఇంధనంగా నడిచే ఈ ట్రాక్టర్‌ను ఇటాలియన్‌ కంపెనీ ‘న్యూహాలండ్‌’ కంపెనీ భాగస్వామ్యంతో ‘బెన్నామాన్‌’ అనే బ్రిటిష్‌ కంపెనీ రూపొందించింది. ఆవుపేడ నుంచి వచ్చే మీథేన్‌ గ్యాస్‌ను మైనస్‌ 162 డ్రిగీల ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించుకునేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించారు. వంద ఆవుల మంద నుంచి సేకరించిన పేడ నుంచి వచ్చే మీథేన్‌ ఈ ట్రాక్టర్‌కు ఏడాది పొడవునా ఇంధనంగా సరిపోతుంది.

గోమయం నుంచి సేకరించిన మీథేన్‌తో నడిచే వాహనాల్లో ఇదే ప్రపంచంలో మొట్టమొదటిదని బెన్నామాన్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ మాన్‌ చెబుతున్నారు. ఇది సాధారణ డీజిల్‌ ట్రాక్టర్లకు దీటుగా పనిచేస్తుందని, డీజిల్‌ ట్రాక్టర్లతో పోల్చుకుంటే, దీని నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏడాదికి 2500–500 టన్నులు తక్కువేనని ఆయన వెల్లడించారు. అమెరికాలో గత డిసెంబర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ట్రాక్టర్‌ పనితీరును ప్రదర్శించారు. త్వరలోనే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

చదవండి: చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర!  నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు

మరిన్ని వార్తలు