ఉక్రెయిన్‌ యుద్ధం.. మార్కెట్‌ క్యాప్‌లో యూరప్‌ దేశాలకు షాక్‌!

10 Mar, 2022 13:20 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడులు యూరప్‌ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రష్యా వైఖరిని ఖండిస్తూ యూరప్‌ దేశాలు ఎడాపెడా ఆంక్షలు పెడుతూ పోతున్నా.. ఆశించిన ఫలితం రావడం లేదు సరికదా అక్కడి ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా ఆదేశాలకు సంబంధించిన మార్కెట్‌ క్యాప్‌ భారీగా కోతకు గురవుతోంది.

బ్లూంబర్గ్‌ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం యూరప్‌ ఆర్థిక శక్తులుగా చెప్పుకునే ఇంగ్లండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపద మార్కెట్‌లో హరించుకుపోయింది. ఒక్క ఇంగ్లండ్‌ మార్కెట్లనే పరిశీలిస్తే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 9 వరకు ఏకంగా 410 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. దీంతో ఆ దేశ మార్కెట్‌ క్యాప్‌ తగ్గి 3.11 ట్రిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.

మనకు తప్పలేదు
ఇక ఇండియా విషయానికి వస్తే ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధంతో మన స్టాక్‌మార్కెట్లు షేక్‌ అయ్యాయి. దేశీ సూచీలు తిరోగమనం పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ సొమ్ము వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా మన మార్కెట్‌ క్యాప్‌కి 357 బిలియన్ల సంపద కరిగిపోయింది. దీంతో మన మార్కెట్‌ క్యాప్‌ 3.16 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ పట్టికలో యూకేని వెనక్కి నెట్టింది ఇండియా.

ఇండియా వెనుక యూకే
గత నెల రోజుల్లో వచ్చిన మార్పులతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా ఇండియా ఇంగ్లండ్‌ను దాటేసింది. ఇంతకాలం ఇండియా కంటే ముందు వరుసలో ఉండే బ్రిటీష్‌ రాజ్యం మార్కెట్‌ చరిత్రలో తొలిసారి ఇండియా వెనక నిలవాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఇండియా కంటే ఇంగ్లండ్‌ మార్కెట్‌పై అధిక ప్రభావం చూపడమే ఇందుకు కారణం

మెరిసిన సౌదీ
మరోవైపు ఏషియా మార్కెట్లలో చైనా, జపాన్‌, హాంగ్‌కాంగ్‌, ఇండియాల తర్వాత స్థానంలో ఉండే సౌదీ అరేబియా మార్కెట్లకు ఈ యుద్ధం కలిసి వచ్చింది. యుద్ధ ప్రభావంతో ఆయిల్‌ ధరలు ఎగిసిపడటంతో.. వివిధ మార్కెట్లలో ఉన్న సొమ్మంతా సౌదీ అరేబియా వైపు పయణించింది. ఫలితంగా రెండు వారాల వ్యవధిలోనే ఈ మార్కెట్‌కి 442 బిలియన్‌ డాలర్ల సంపద వచ్చి పడింది. ఫలితంగా సౌదీ అరేబియా మార్కెట్‌ క్యాప్‌ 3.25 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది

నంబర్‌ వన్‌
యుద్ధ అనంతర పరిస్థితుల్లో ఉన్న లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికీ మార్కెట్‌ క్యాప్‌ విషయంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం ప​‍్రదర్శిస్తోంది. ఆ దేశ మార్కెట్‌ క్యాప్‌ విలువ ఏకంగా 46 ట్రిలియన​ డాలర్లుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత స్థానంలో డ్రాగన్‌ కంట్రీ చైనా నిలిచింది. చైనా మార్కెట్‌ క్యాప్‌ 11.3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. 

టాప్‌ 5
మార్కెట్‌ క్యాప్‌ విషయంలో ప్రపంచ దేశాల సరళిని గమనిస్తే తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉండగా ఆ తర్వాత వరుసగా జపాన్‌ 5.7 ట్రిలియన్‌ డాలర్లు హాంగ్‌కాంగ్‌ 5.5 ట్రలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా 3.25 ట్రిలియన్‌ డాలర్లు, ఇండియా 3.16 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. మన తర్వాత 3.12 ట్రిలియన్‌ డాలర్లతో కెనడా నిలిచింది.

యూరప్‌ పరిస్థితి
యుద్ధం దెబ్బతో యూరప్‌ స్టాక్‌మార్కెట్లు కంగుతిన్నాయి. ఇక్కడ యూనెటైడ్‌ కింగ్‌డమ్‌ 3.11 ట్రిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ 2.71 ట్రిలియన్‌ డాలర్లు, జర్మనీ2.18 ట్రిలియన​ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్‌ తరహాలో ప్రమాదం అంచున ఉన్న తైవాన్‌ మార్కెట్‌ క్యాప్‌ 2.06 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

చదవండి: Russia Ukraine War: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు