మంచులా కరిగిన ఆస్తులు.. ఒక్కరోజే 90వేల కోట్ల నష్టం!

24 May, 2023 19:36 IST|Sakshi

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద మంచులా కరిగింది. ఒక్కరోజే అత్యధికంగా 11 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.90వేల కోట్లు) తుడిచి పెట్టుకుపోయాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం ముంగిట ఉందని.. దీంతో లగ్జరీ వస్తువులకు డిమాండ్‌ తగ్గనుందనే నివేదికలు విడుదలైన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. 

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎల్‌వీఎంహెచ్‌ను నెలకొల్పారు. ఆ కంపెనీ ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు, షాంపేలు, ఖరీదైన గౌన్లను తయారు చేయడంలో ప్రసిద్ది చెందింది. ఆ సంస్థ ఉత్పత్తుల అమ్మకాల్లో అమెరికా వాటా 27శాతం కాగా ఆసియా వాటా 30శాతం. ఇటీవల ఇవి భారీగా పెరిగాయి. అదే సమయంలో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది.  

అయితే, ఇటీవల అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు లగ్జరీ బ్రాండ్‌లపై ప్రభావాన్ని చూపాయి. దీంతో ఆ రంగానికి చెందిన హెర్మెస్‌ ఇంటర్నేషనల్‌ 5.5శాతం, ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ కూడా సుమారు 5శాతంనష్టపోయింది. బెర్నార్డ్‌ మొత్తం సంపదలో కేవలం ఒక్క రోజే 11బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

అయినప్పటికీ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం..ఈ ఫ్రెంచ్‌ బిలియనీర్‌ 192 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో కుబేరుడి జాబితాలో తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆయన సందప 29.5 బిలియన్ డాలర్లు పెరిగింది. రెండోస్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్‌కు బెర్నార్డ్‌ సంపద మధ్య వ్యత్యాసం దాదాపు  11.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.

చదవండి👉 రూ.5వేలు, రూ.10 వేల నోట్లను విడుదల చేస్తే మంచిది.. కేంద్రం నిర్ణయం ఇదే!

మరిన్ని వార్తలు