World Stroke Day 2022: ఈ రెండూ తెలిస్తే చాలు! గండం గడిచినట్టే!

29 Oct, 2022 13:05 IST|Sakshi

ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్‌ స్ట్రోక్ డే  నిర్వహిస్తారు.  పక్షవాతానికి కారణాలు, నివారణపై  అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును పాటిస్తారు. ఈ వ్యాధి తీవ్ర  స్వభావాన్ని,  మానవాళిపై చూస్తున్న ప్రభావాన్ని  నొక్కి చెప్పడానికే ఈ డేని జరుపుతారు. అలాగే బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉండటం కూడా ఒక లక్క్ష్యం. అయితే ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో  ముందస్తుగా  గుర్తించడం, సరైన సమయంలో అత్యవసర చికిత్స అందించడం అనే రెండు విషయాలు చాలా కీలకం.

ప్రపంచ స్ట్రోక్ డే 2022: చరిత్ర
2006లో వార్షిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుఎస్‌వో), 2010లో స్ట్రోక్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2004లో అక్టోబర్ 29న  డబ్ల్యుఎస్‌వో వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది.

ప్రపంచ స్ట్రోక్ డే  2022:  థీమ్
స్ట్రోక్ సంకేతాలు, నాణ్యమైన చికిత్స సకాలంలో అందించేలా అవగాహన పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఇలాంటి డేలను జరుపుకునే క్రమంలో ప్రతీ ఏడాది ఒక థీమ్‌ ఉంటుంది.  అలా వరల్డ్‌ స్ట్రోక్ డే 2022 కి గాను   'మినిట్స్‌ కెన్‌ సేవ్‌ లైఫ్స్‌.. సమయం చాలా విలువైనది అనే థీమ్‌తో ఈ  ఏడాది ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తున్నారు.

పక్షవాతం లేదా స్ట్రోక్ అంటే ఏంటి?
మెదడుకు రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినా, ఆక్సిజన్  సరఫరా తగ్గిపోయినా స్ట్రోక్‌ వస్తుంది.ఈ సమయంలో మెదడు కణాలు కణజాలు దెబ్బతింటాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే మెదడు తీవ్రంగా  దెబ్బ తినడం, లేదా ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ప్రధానంగా జన్యపరమైన మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. స్ట్రోక్ ప్రస్తుత మరణాలకు రెండవ అతిపెద్ద కారణం. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ప్రధాన కారణం అయినప్పటికీ, దాదాపు అన్ని స్ట్రోక్‌లను ముందే గుర్తిస్తే నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 110 మిలియన్ల మంది స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. వీరిలో కొంతమందిలో తీవ్రమైన శారీరక వైకల్యం, కమ్యూనికేషన్‌  ఇబ్బందులు వస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా, 25 ఏళ్లు పైబడిన నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి 3 సెకన్లకు  ఒకరు స్ట్రోక్‌తో బాధపడుతున్నారు,  అంతేకాదు ఏడాదికి 12.2 మిలియన్ల కొత్త  కేసులు నమోదవుతున్నాయి. 55 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో యువకులలో ఇది సర్వసాధారణంగా మారుతోంది. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైనఆహారం, కొన్ని మందులు ప్రభావంస్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి

గోల్డెన్‌ అవర్‌
60 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఆసుపత్రికి  చేర్చితే బెటర్‌. అయితే పక్షవాతానికి సంబంధించి 4.5 గంటల పరిధిని‘‘ గోల్డెన్ అవర్”గా పిలుస్తారు. ఈ గోల్డెన్ అవర్‌లో క్లాట్-బస్టింగ్ డ్రగ్ tPA దీర్ఘకాల మెదడు దెబ్బతినకుండా నివారిస్తుంది. ప్రతి నిమిషం స్ట్రోక్‌కు గురైన వారికి చికిత్స చేయకపోతే; సగటు రోగి 1.9 మిలియన్ న్యూరాన్లు, 13.8 బిలియన్ సినాప్సెస్ ,ఏడు మిలియన్ల ఫైబర్‌లను కోల్పోతారు అని ప్రముఖ న్యూరాలజిస్టులు   హెచ్చరిస్తున్నారు.

స్ట్రోక్ లక్షణాలు: ఎవరైనా స్ట్రోక్‌తో బాధపడుతున్నారని  ఎలా గుర్తించాలి
♦ తీవ్రమైన తలనొప్పి
♦ శరీరంలో  ఒక వైపు తిమ్మిరి ముఖ్యంగా ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి
♦ మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో సమస్య
♦ దృష్టి కోల్పోవడం; కొన్నిసార్లు దృష్టి  మసకగా అస్పష్టంగా మారిపోవడం
వికారం ,వాంతులు
♦ అస్థిర నడక;  సరిగ్గా నిలబడలేకపోవడం
♦ మైకం

 ఏమి చేయాలి
♦ రోగిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ముఖ్యంగా పక్షవాతానికి సరైన చికిత్స అందించే సామర్థ్యమున్న ఆసుపత్రికి  తీసుకెళ్లాలి.
♦ మొదటి కొన్ని గంటల్లో  సీటీ స్కాన్‌, కొన్ని  పరీక్షల ద్వారా  సరైన రోగ నిర్ధారణ చాలా అవసరం.
♦ అత్యంత ఖచ్చితమైన చికిత్స ఎండోవాస్కులర్ థ్రోంబెక్టమీ. రక్తం గడ్డకట్టడాన్ని నివారించేలా మెకానికల్ థ్రోంబెక్టమీ చేయాలి.  2015 నుంచి అమల్లోకి వచ్చిన ఈ  చిక్సితలో  క్యాథ్ ల్యాబ్‌కి తీసుళ్లి, యాంజియో ద్వారా బ్లాక్‌ అయిన ధమనిని  సరిచేస్తామని  వైద్య నిపుణులు చెబుతున్నారు.
♦  రోగి వయసు, తీవ్రతను బట్టి ఎలాంటి చికిత్స, లేదా  ఆపరేషన్‌ చేయాలి అనేది వైద్యులు నిర్ధారిస్తారు.

మరిన్ని వార్తలు