2022లో బెటరే కానీ, 2023 దారుణం!

7 Oct, 2022 04:19 IST|Sakshi

 ప్రపంచ వస్తు వాణిజ్యంపై డబ్ల్యూటీఓ తాజా అంచనా

ఈ ఏడాది వృద్ధి అంచనా 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంపు

2023 అంచనాలకు భారీ కోత

3.4 శాతం నుంచి 1 శాతానికి డౌన్‌

న్యూఢిల్లీ: ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్‌ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది.  నివేదికలో సంస్థ ఆర్థికవేత్తల మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే..

► అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి.  
► 2022 అక్టోబర్‌ నుంచే ప్రపంచ వాణిజ్య మందగమనం తీవ్రమై, 2023లో తీవ్ర రూపం దాల్చుతుంది.  
► పలు కారణాల వల్ల  దిగ్గజ ఎకానమీలో దిగుమతుల డిమాండ్‌ కూడా మందగించే అవకాశం ఉంది.  
► ప్రత్యేకించి యూరోప్‌ను చూస్తే, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం గృహ వ్యయం, తయారీ వ్యయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.  
► అమెరికాలో వడ్డీరేట్ల పెంపు– గృహాలు, మోటార్‌ వాహనాల కొనుగోళ్లు, స్థిర ఇన్వెస్టమెంట్లకు విఘాతం కలిగిస్తోంది.  
► ఇక చైనాలో కోవిడ్‌–19 సవాళ్లు కొనసాగుతున్నాయి. బలహీన అంతర్జాతీయ డిమాండ్, తగ్గిన ఉత్పత్తి వంటి సమస్యలు చైనాకు ఎదురవుతున్నాయి.  
► ఇంధనం, ఆహారం, ఎరువుల కోసం పెరుగుతున్న దిగుమతి బిల్లులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత, రుణ సవాళ్లకు దారితీసే వీలుంది.  
► పలు ఆర్థిక వ్యవస్థల్లో అనుసరిస్తున్న వడ్డీరేట్ల పెంపు విధానం డిమాండ్‌ పరిస్థితులను దెబ్బతీసే అంశం.  

భారత్‌కు చేదువార్తే...
ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్‌కు  ఐఎంఎఫ్‌ తాజా అంచనాలు కొంత ప్రతికూలమైనవే కావడం గమనార్హం. 2021–22లో 400 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఎగుమతుల విషయంలో భారత్‌ గడచిన రెండు నెలల నుంచి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. జూలై, ఆగస్టు నెలల్లో తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది.

భారత్‌ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్‌ డాలర్లు) ఆగస్టు తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది.  ఇక జూలై నెల్లో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు  మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్‌ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయాయి. మొత్తంమీద తాజా గణాంకాలతో 21 నెలలు వృద్ధి బాటన నడిచిన ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల నడుమ 2022 సెప్టెంబర్‌లో క్షీణతలోకి జారిపోయినట్లయ్యింది. ఇక ఎగుమతులకన్నా, దిగుమతులు భారీగా ఉండడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 

భారత్‌ కరెంట్‌ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్‌ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్‌ అకౌంట్‌ 6.6 బిలియన్‌ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో 3 శాతం క్యాడ్‌ ఉంటుందని ఆర్‌బీఐ పాలసీ విధానం భావిస్తోంది. ఇక 2022 ఏప్రిల్‌లో 606.5 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్‌ 23 నాటికి 537.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వరుసగా ఎనిమిది వారాలుగా తగ్గుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం.

మరిన్ని వార్తలు