5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

15 Dec, 2022 06:35 IST|Sakshi

21 నెలల కనిష్ట స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం స్థాయికి చేరిక

కూరగాయల ధరలు తగ్గుముఖం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్‌) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్‌ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి.   

విభాగాల వారీగా..
► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది.
► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్‌ 20 శాతానికి (డిఫ్లేషన్‌) పడిపోయింది.   
► ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది.
► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది.

మరింత తగ్గిస్తాం..  
ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.   

మరిన్ని వార్తలు