X (Twitter): ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్‌ గాలి తీసేసిన సీఈవో!

1 Oct, 2023 16:12 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌) ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్‌ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు.

ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్‌లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్‌ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు.

కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్‌ చేయడానికి వారం ముందు ట్విటర్‌లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్‌లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. 

కాగా ఎక్స్‌ తమ డైలీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్‌’ అనే టెక్నాలజీ పబ్లికేషన్‌ ద్వారా తెలుస్తోంది. ఎక్స్‌కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు.

‘మ్యాషబుల్‌’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్‌ 3.7 శాతం డైలీ యాక్టివ్‌ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్‌ యూజర్లను కలిగిన ట్విటర్‌.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది.

ఇక మంత్లీ యాక్టివ్‌ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్‌’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్‌ వేదికపై అన్నారు.

మరిన్ని వార్తలు