‘ఎవరు భయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’

1 Oct, 2023 11:42 IST|Sakshi

‘టాలెంట్ ఎవడి సొత్తుకాదు’ అనే మాట చాలా సార్లు వినే ఉంటాం. అయితే కొన్ని సంఘటనలు చూసినప్పుడో లేదంటే విన్నప్పుడో ఆ మాట నిజమేననిపిస్తుంది.

చేతిలో జాబు లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ టాలెంట్‌కు కొదువలేదు. ఇదిగో ఈ తరహా లక్షణాలున్న ఓ యువకుడు తన మనసుకు నచ్చిన జాబ్‌ కోసం ఏం చేశాడో తెలుసా?

ఎవరైనా సోషల్‌ మీడియా వినియోగిస్తూ గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటే..గడిచిన సమయం తిరిగి రాదు మిత్రమా అంటూ కొటేషన్లు చెబుతుంటాం. కానీ అదే సోషల్‌ మీడియాని ఉపయోగించి అవకాశాల్ని సృష్టించుకోవచ్చని నిరూపించాడు ఆయుష్‌. ఎక్స్‌ యూజర్‌ ఆయుష్‌ ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఓ రోజు ఆయుష్‌ ఎక్స్‌ని బ్రౌజింగ్‌ చేస్తుండగా.. ఓ పోస్ట్‌ అతని కంటపడింది. 

బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్ కో-ఫౌండర్‌ సుభాషిస్‌ చౌదరి. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఆయుష్‌ తాను దుకాణలో ఫ్రంటెండ్ డెవలపర్‌ టీమ్‌లో చేరాలనుకుంటున్నానని, అవసరమైతే మీకోసం ఫ్రీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని రిప్లయి ఇచ్చాడు.  

ప్రతి స్పందనగా సుభాష్ చౌదరి కాబోయే ఫ్రంట్-ఎండ్ డెవలపర్‌లకు ఓ ఛాలెంజ్‌ విసిరుతూ ఫిగ్మా డిజైన్‌ను షేర్‌ చేశారు. అందులో హెచ్‌టీఎంల్‌ కోడ్‌ను ఉపయోగించి 100శాతం పిక్సెల్ పర్ఫెక్ట్‌గా ఉండేలా చేయాలి. అలా చేస్తే దుకాణ్‌లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఇస్తానని తెలిపారు.

కానీ హెచ్‌టీఎంల్‌ కోడ్‌ సాయంతో 100 శాతం పిక్సెల్‌ పర్ఫెక్ట్‌గా  ఫిగ్మా డిజైన్‌ చేయడం అంత సులుభం కాదు. ఇందుకోసం హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌పై అవగాహన ఉండాలి. చాలా ఓపిక, ఖచ్చితత్వం కూడా అవసరం. ఆయుష్ సవాలును స్వీకరించాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. దుకాణ్‌లో ఇంటర్వ్యూకి వెళ్లాడు. కొన్ని వారాల తర్వాత సుభాష్‌ మరో ట్వీట్‌ చేశారు.

తాను ఇచ్చిన ఛాలెంజ్‌లో  ఆయుష్‌ గెలిచాడని చెప్పారు. ఆయుష్‌కి ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా, తాను దుకాణ్‌ స్టార్టప్‌లో ఫ్రంటెండ్ ఇంజినీరింగ్ టీమ్‌లో చేరానని, అవకాశాన్ని అందుకున్నందుకు ‘సూపర్ పంప్’ అయ్యానని ఆయుష్‌ చెప్పాడు.

ఫిగ్మా అంటే ఏమిటి?
 ఫిగ్మా అనేది ప్రముఖ డిజైన్‌ టూల్‌. ఆయా కంపెనీలు తమ ప్రొడక్ట్‌ల ప్రొటోటైప్‌లు, ఇతర డిజైన్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టూల్‌ సాయంతో కష్టమైన, వివరణాత్మక డిజైన్లు చేయొచ్చు.  

‘సూపర్ పంప్’ అంటే?
సందర్భాన్ని బట్టి మనస్సు ఎనర్జిటిక్‌ ఎగ్జైట్‌మెంట్‌, ఉత్సాహంతో నిండింది అని చెప్పేందుకు సూపర్‌ పంప్‌ అనే పదాన్ని వినియోగిస్తారు. 

మరిన్ని వార్తలు