షావోమీ భారీ షాక్‌, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు!

21 Aug, 2022 17:11 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే ఖర్చులు తగ్గిస్తూ.. ఆదాయం పెంచుకునే మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం షావోమీ వందల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 

ఇటీవల షావోమీ క్యూ2 ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో షావోమీ సేల్స్‌ 20శాతం పడిపోయాయి. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ2లో ఆశించిన ఫలితాలు రాలేదని షావోమీ యాజమాన్యం తెలిపింది. నిరాశజనకమైన ఫలితాలతో  దాదాపూ 3శాతం తన వర్క్‌ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఉద్యోగుల తొలగింపుపై కారణాలు తెలియాల్సి ఉండగా.. షావోమీ త్రైమాసిక లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జూన్ త్రైమాసికంలో ఆ సంస్థ లాభాలు 20 శాతం పడిపోయిందని, మొత్తం ఉన్న ఉద్యోగుల్లో 900మందిని విధుల నుంచి తొలగించినట్లు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

900మంది ఉద్యోగుల తొలగింపు 
జూన్ 30 నాటికి షావోమీలో 32,869 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 30,110మంది చైనాలో మిగిలిన ఉద్యోగులు, భారత్‌, ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా క్యూ2 ఫలితాలపై అసంతృప్తితో ఉన్న షావోమీ ఉద్యోగుల్ని పక్కన పెట్టింది.  

ఈ సందర్భంగా షావోమీ అధ్యక్షుడు వాంగ్ జియాంగ్ మాట్లాడుతూ, "ఈ త్రైమాసికంలో, పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు  సంక్లిష్ట రాజకీయ వాతావరణంతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ సవాళ్లు మొత్తం మార్కెట్ డిమాండ్ తో పాటు మా ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించాయని అన్నారు. 
 
 

మరిన్ని వార్తలు