షావోమి ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

23 Mar, 2021 13:15 IST|Sakshi

 ఉద్యోగులకు 15 రోజుల  వేతనం అదనపు బోనస్‌

ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్‌ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్‌షిప్‌ బోనస్‌కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్‌ మహమ్మారి  సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్‌ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్‌ బోనస్‌కు అదనంగా ఈ బోనస్‌ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా  అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఖర‍్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల  ప్రకటించింది. స్థానిక డిమాండ్‌కే తమ తొలి ప్రాధాన్యమని  జైన్‌ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని  చెప్పారు.  కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ  త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో ఉంది షావోమి.  27 శాతం మార్కెట్ వాటాతో  మార్కెట్‌ లీడర్‌గా ఉంది. దేశంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్‌సెట్‌లు వర్ బ్యాంక్‌లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు