భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అప్పుడే.. రేంజ్ ఎంతో తెలుసా?

14 Mar, 2022 18:21 IST|Sakshi

ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ యమహా కొద్ది రోజుల క్రితం యూరోపియన్ మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను మన దేశంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ రెండిటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రష్లేన్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 11న యమహా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. యమహా ఇప్పటికే భారత మార్కెట్లో ఈ01 పేరును జాబితా చేసింది. ఇటీవల యూరోపియన్ మార్కెట్లో లాంఛ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ నియోను కూడా ఇక్కడ లాంఛ్ చేసే అవకాశం ఉంది. 

ఆసియాన్ దేశాలలో దశలవారీగా ఈ స్కూటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్'లో రీడిజైన్ చేసిన స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన ఫుల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. 

ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్‌సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఏథర్ 450, ఓలా ఎస్1 ప్రొ వంటి వాటితో పోటీ పడే సామర్ధ్యం కలిగి ఉంది.

(చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!)

మరిన్ని వార్తలు