ఎలక్ట్రిక్ వాహనల కోసం ప్రణాళికలు రచిస్తున్న యమహా!

25 Jul, 2021 20:03 IST|Sakshi

జపాన్ ద్విచక్ర వాహన సంస్థ యమహా భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావడానికి ప్రణాళికలను రచిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దం అవుతున్నట్లు తెలిపింది. ఈ-మొబిలిటీలో పెట్టుబడులు భారత ప్రభుత్వ విధానంపై, స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఆధారపడి ఉంటుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని భారీగా పెంచింది. కానీ, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలను ఇంకా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యమహా అభిప్రాయపడింది.

జపాన్ లోని నిపుణుల బృందం భారతదేశం, ప్రపంచంలోని ఇతర మార్కెట్ల కోసం ఈవి వేదికను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు. "ఇప్పటికే మా జపాన్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక బృందం భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల అవసరాల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొని రావడానికి పనిచేస్తుంది" అని పేర్కొన్నారు. ఈవీ బ్రాండ్ గోగోరోతో కలిసి పనిచేస్తోందని, గత రెండు సంవత్సరాలుగా తైవాన్ కర్మగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోందని కూడా ఆయన తెలియజేశారు. 

ఇండియాకి విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గణనీయమైన సవాళ్లు ఎదుర్కొంటున్నామని షితారా తెలియజేశారు. "ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించిన పెద్ద సవాళ్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్, స్థిరమైన విధానాన్ని రూపొందించకపోతే దీనిని పరిష్కరించలేము" అని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల సంబందించిన సమస్యలను పరిష్కరించగలిగితే సామాన్య ప్రజలు ఈవిలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆయన నొక్కి చెప్పారు. "కాబట్టి పైన పేర్కొన్న అన్నీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాత, మేము భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడమే కాకుండా తయారు చేస్తాము" అని షితారా పేర్కొన్నారు. యమహా ఇటీవల ఫాసినో 125 ఫై హైబ్రిడ్ స్కూటర్ లాంఛ్ చేసింది. 

మరిన్ని వార్తలు