రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన యమహా.. రేంజ్ ఎంతో?

6 Mar, 2022 21:07 IST|Sakshi

అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం, ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆసక్తి పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి స్టార్టప్ కంపెనీలతో సహ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ యమహా ఇతర తయారీదారుల మాదిరిగా కాకుండా సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు సిద్దం అవుతుంది. యమహా తన మొదటి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. 

ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్
యమహా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నియోస్. దీనిని 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన ఈ02 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఈ రాబోయే ఈ-స్కూటర్ అతిపెద్ద హైలైట్ ఏమిటంటే, ఇందులో బ్యాటరీ మార్పిడి టెక్నాలజీ ఉంది. ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ చేత పనిచేస్తుంది. ఇంకా అధికారికంగా వీటి స్పెసిఫికేషన్స్ వెల్లడికాలేదు. యమహా రాబోయే ఈ-స్కూటర్‌లో ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఫుల్​ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్​ లెగ్స్​ మధ్యలో చేర్చారు. 

ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్
ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్'లో రీడిజైన్ చేసిన స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన ఫుల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్‌సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది.

(చదవండి: టాటా ప్లే(స్కై) కస్టమర్లకు శుభవార్త..!)

మరిన్ని వార్తలు