ఆ పది మంది సంపాదన 400 బిలియన్‌ డాలర్లు! ఈ ఒక్క ఏడాదిలోనే..

31 Dec, 2021 11:51 IST|Sakshi

సంపాదించడం ఎంత కష్టమో.. ఖర్చు పెట్టడం అంత సులువు. ఈ సూత్రం అందిరికీ వర్తించదు. అలాగే క్షణాల్లో కోట్లు సంపాదించి.. అంతే వేగంగా కోటాను కోట్లు పొగొట్టుకున్న వ్యాపార దిగ్గజాలను మన కళ్ల ముందే చూస్తున్నాం. 2021 ముగింపు సందర్భంగా ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన అపర కుబేరుల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ర్యాంకింగ్‌లను పక్కనపెట్టి.. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే వాళ్ల సంపాదనను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంపాదనలో సింహభాగం ఒక్కడిదే కావడం.. ఆ ఒక్కడు ఎలన్‌ మస్క్‌ కావడం మరో విశేషం. 


ఎలన్‌ మస్క్‌..
ఆయన సంపాదన 277 బిలియన్‌ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదించింది అక్షరాల 121 బిలియన్‌ డాలర్లు. 60 శాతం పెరిగిన టెస్లా షేర్లు, సొంత కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ఒప్పందాలతో ఈ ఏడాది విపరీతంగా సంపాదించాడీయన. తద్వారా కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 

బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌.. 

ఫ్రెంచ్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మొత్తం సంపద 176 బిలియన్‌ డాలర్లు. ఇందులో ఈ ఏడాది సంపాదన 61 బిలియన్‌ డాలర్లు. యూరప్‌ దేశాల అత్యంత ధనికుడిగా పేరున్న ఈ 72 ఏళ్ల వ్యాపార దిగ్గజం.. ప్రపంచంలోనే లగ్జరీ గూడ్స్‌ కంపెనీ పేరున్న ఎల్‌వీఎంహెచ్‌కు చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతున్నారు. 

లారీ పేజ్‌.. 
ఈయన కంప్యూటర్‌ సైంటిస్ట్‌, గూగుల్‌ కో-ఫౌండర్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ఫాబెట్‌ కంపెనీ(గూగుల్‌ మాతృక సంస్థ)ను ఈ ఏడాది కూడా విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు లారీ పేజ్‌. ఈ గూగుల్‌ మాజీ సీఈవో మొత్తం సంపద 130 బిలియన్‌ డాలర్లు కాగా, కేవలం ఈ ఏడాదిలో 47 బిలియన్‌ డాలర్ల ఆదాయం(షేర్ల రూపేనా) వెనకేసుకున్నాడు. 

సెర్గె బ్రిన్‌.. 
గూగుల్‌ మరో సహ వ్యవస్థాపకుడు. ఈ ఏడాది 45 బిలియన్‌ డాలర్ల సంపాదనతో ఏకంగా 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేశాడు. సెర్గె బ్రిన్‌(48) మొత్తం సంపాదన 125 బిలియన్‌ డాలర్లు. ఈయనకు ఆల్ఫాబెట్‌ కంపెనీలో 38 మిలియన్‌ షేర్లు ఉన్నాయి.

 స్టీవ్‌ బాల్‌మర్‌
మైక్రోసాఫ్ట్‌ కంపెనీ మాజీ సీఈవో. ఎన్‌బీఏ లాస్‌ ఏంజెల్స్‌ క్లిపర్స్‌ టీం యాజమాని కూడా. తన వ్యాపారంతో పాటు మైక్రో సాప్ట్‌ కంపెనీ(కంపెనీ లాభాల వల్ల)లో ఉన్న షేర్ల ద్వారా ఈ ఏడాది 41 బిలియన్‌ డాలర్లు సంపాదించాడు స్టీవ్‌ బాల్‌మర్‌(65).

 ల్యారీ ఎల్లిసన్‌
ఒరాకిల్‌ చైర్మన్‌, వ్యవస్థాపకుడు ఈయన. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ నెలలో భారీ ఆదాయం వెనకేసుకుంది ఒరాకిల్‌ కంపెనీ. దీంతో ఈ 77 ఏళ్ల వ్యాపార దిగ్గజం 29 బిలియన్‌ డాలర్లు సంపాదించడంతో పాటు 109 బిలియన్‌ డాలర్ల మొత్తం సంపదతో సెంచరీ బిలియన్‌ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.


మార్క్‌ జుకర్‌బర్గ్‌
మెటా కంపెనీ(ఫేస్‌బుక్‌) సీఈవోగా ఈ ఏడాది 24 బిలియన్‌ డాలర్ల సంపాదన వెనకేసుకున్నాడు మార్క్‌ జుకర్‌బర్గ్‌. కంపెనీ పేరు మారినా, వివాదాలు వెంటాడినా.. లాభాల పంట మాత్రం ఆగలేదు. మెటాలో ఇతనికి 13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది 20 శాతం పెరిగింది జుకర్‌బర్గ్‌ సంపద. ఇదిలా ఉంటే ఈ టాప్‌ 10 లిస్ట్‌లో అత్యంత చిన్నవయస్కుడిగా నిలిచాడు మార్క్‌ జుకర్‌బర్గ్‌(37). 


వారెన్‌ బఫెట్‌
బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈవో. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన సంపదలో సగం సేవా కార్యక్రమాలకు ఇస్తానని ప్రకటించాడు. కానీ, ఈసారి ఈ ప్రకటన వర్కవుట్‌ కాలేదు. కంపెనీ షేర్ల తీరు ఆశాజనకంగా సాగలేదు. దీంతో కేవలం 21 బిలియన్‌ డాలర్ల ఆదాయం మాత్రమే వెనకేసుకున్నాడు. 91 ఏళ్ల ఈ వ్యాపార దిగ్గజం మొత్తం సంపద విలువ 109 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

 


బిల్‌గేట్స్‌
దానాలు చేసుకుంటూ పోతున్నా.. బిల్‌గేట్స్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ షేర్ల  రూపంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. ఏడు బిలియన్‌ల డాలర్లు సంపాదనతో.. సంపదను 139 బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నాడు 66 ఏళ్ల గేట్స్‌. 

జెఫ్‌ బెజోస్‌
అమెజాన్‌ ఫౌండర్‌. ఎలన్‌ మస్క్‌తో పోటాపోటీగా వార్తల్లో నిలిచిన పర్సనాలిటీ. ప్రపంచంలోనే రెండో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన మొత్తం వెనకేసుకుంది కేవలం 5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. 57 ఏళ్ల బెజోస్‌.. ఈ ఏడాది అమెజాన్‌ సీఈవో పగ్గాల నుంచి  దిగిపోవడంతో పాటు స్పేస్‌ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ చేస్తూ గడిపాడు. ఈ ఏడాది అపర కుబేరుల్లో గట్టి దెబ్బ పడింది ఎవరికంటే.. ఈయనకే!.

 

-సాక్షి, వెబ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు