సామాన్యుడికి దూరమైన స్వర్ణం

28 Jul, 2020 11:22 IST|Sakshi

ముంబై : బంగారం, వెండి ధరలు రికార్డు స్ధాయిలో పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడికి స్వర్ణం అందనంత దూరానికి చేరువవుతోంది. పెళ్లిళ్లకూ, శుభకార్యాలకూ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అమెరికా-చైనా ఉద్రిక్తత, కరోనా వైరస్‌ కల్లోలం, అనిశ్చత రాజకీయ పరిస్థితులు రాబోయే రోజుల్లోనూ బంగారానికి భారీ డిమాండ్‌ను పెంచుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా బంగారం ధరలు ఏకంగా 1500 రూపాయలకు పెరగడం ఆల్‌టైం హైలను నమోదు చేస్తుండటంతో పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్‌ పడేలా లేదని చెబుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని పృథ్వీ ఫిన్‌మార్ట్‌ హెడ్‌ మనోజ్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించాలని, సత్వర అమ్మకాలు దూరంగా ఉండాలని సూచించారు. చదవండి : క్యా'రేట్‌' మోసం

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 2,000 డాలర్లకు చేరువవడంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లోమెటల్‌ భారమైంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 150 రూపాయలు పెరిగి 52,250 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలోవెండి 977 రూపాయలు పెరిగి  66,505 రూపాయలు పలికింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికా డాలర్‌ బలహీనపడటంతో పెట్టుబడి సాధనంగా బంగారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు