రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు యస్‌ బ్యాంక్‌ నోటీసులు

30 Jul, 2020 11:04 IST|Sakshi

ముంబైలోని ప్రధాన కార్యాలయ స్వాధీనానికి సన్నాహాలు

రూ. 2892 కోట్ల రుణాల రికవరీలో భాగంగా నోటీసులు

రెండు నెలల గడువు తదుపరి ఆస్తుల స్వాధీనంవైపు బ్యాంక్‌ చూపు

రుణాల రికవరీ బాటలో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీన పరచుకునేందుకు వీలుగా యస్‌ బ్యాంక్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని శాంతాక్రజ్‌లోగల ప్రధాన కార్యాలయంతోపాటు.. మరో ఇతర రెండు ఆఫీసులను దాఖలు పరచమంటూ నోటీసులు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఇచ్చిన రూ. 2892 కోట్ల రుణాల రికవరీ కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు యస్‌ బ్యాంక్‌ నోటీసులో పేర్కొంది. వీటిలో భాగంగా నాగిన్‌ మహల్‌లోని రెండు ఫ్లోర్లను యస్‌ బ్యాంక్‌ సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొండిబకాయిల సమస్యలతో కొద్ది రోజులక్రితం యస్‌ బ్యాంక్‌ దివాళా పరిస్థితికి చేరిన విషయం విదితమే. తదుపరి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను పొందింది. తద్వారా యస్ బ్యాంక్‌ కార్యకలాపాలను ఎస్‌బీఐ తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్  వర్గాలు తెలియజేశాయి. అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు యస్‌ బ్యాంక్‌ సుమారు రూ. 12,000 కోట్ల రుణాలు అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాయి. 

బీఎస్‌ఈఎస్‌ నుంచి
శాంతాక్రజ్‌లోని ప్రధాన కార్యాలయాన్ని బీఎస్‌ఈఎస్‌ నుంచి రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొంతం చేసుకుంది. బీఎస్‌ఈఎస్‌ను అనిల్‌ గ్రూప్‌ కొనుగోలు చేశాక రిలయన్స్‌ ఎనర్జీగా మార్పుచేసి తదుపరి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విలీనం చేసినట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి.  2018లో ముంబైలోని ప్రధాన కార్యాలయానికి అనిల్ అంబానీ గ్రూప్‌ తరలివెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. గ్రూప్‌లోని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు సంబంధించిన రిలయన్స్‌ క్యాపిటల్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌తోపాటు.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితర వివిధ విభాగాలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇటీవల పలు కార్యాలయాలను ఏకంచేయడం ద్వారా కార్యకలాపాలను నార్త్‌ వింగ్‌లో కన్సాలిడేట్‌ చేసినట్లు మీడియా పేర్కొంది. కాగా.. మే 5న రుణాలను చెల్లించమంటూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రెండు నెలల గడువుతో యస్‌ బ్యాంక్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.  అయితే కంపెనీ రుణ చెల్లింపులను చేపట్టకపోవడంతో ఆస్తులను సొంతం చేసుకునే సన్నాహాలు యస్‌ బ్యాంక్‌ చేస్తున్నట్లు మీడియా తెలియజేసింది.

మరిన్ని వార్తలు