నేటితో ముగియనున్న యస్‌ బ్యాంక్‌ షేర్ల లాకిన్‌

13 Mar, 2023 01:53 IST|Sakshi

అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అంచనాలు    

ముంబై: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ షేర్ల మూడేళ్ల లాకిన్‌ వ్యవధి సోమవారంతో ముగియనుంది. దీంతో మార్కెట్లో భారీ అమ్మకాలు వెల్లువెత్తవచ్చని  భావిస్తున్నారు. 2020 మార్చిలో యస్‌ బ్యాంక్‌లో దాదాపు 49 శాతం వాటాలు కొనుగోలు చేసిన తొమ్మిది బ్యాంకులు తాజాగా షేర్లను అమ్ముకుని నిష్క్రమించేందుకు ప్రయత్నించవచ్చని అంచనా. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు (రిటైల్, సంపన్న వర్గాలు, ప్రవాస భారతీయులు) చెందిన 135 కోట్ల షేర్లు, ఈటీఎఫ్‌లకు చెందిన 6.7 కోట్ల షేర్లు లాకిన్‌ అయి ఉన్నాయి.

2022 డిసెంబర్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐకి 605 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ఐసీఐసీఐ బ్యాంకులకు తలో 100 కోట్ల షేర్లు ఉన్నాయి.  నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్‌ బ్యాంక్‌ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు తలో రూ. 10,000 కోట్లు సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్‌ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్‌ విధించారు. ఇతర ఇన్వెస్టర్లకూ ఇదే నిబంధన వర్తింపచేశారు.  
 

మరిన్ని వార్తలు