Yes Bank Q1 Results: యస్‌ బ్యాంక్‌ జూమ్‌.. లాభం వచ్చింది కానీ, అవి తగ్గాయి!

25 Jul, 2022 11:43 IST|Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 314 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ లాభం సైతం రూ. 207 కోట్ల నుంచి రూ. 311 కోట్లకు ఎగసింది. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 32 శాతం పుంజుకుని రూ. 1,850 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.47 శాతంగా నమోదయ్యాయి.

వడ్డీయేతర ఆదాయం మాత్రం 10 శాతం నీరసించి రూ. 781 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు రూ. 2,233 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రొవిజన్లు 62 శాతం దిగివచ్చి రూ. 175 కోట్లకు పరిమితమయ్యాయి. పునర్వ్యవస్థీకృత రుణాలు రూ. 6,450 కోట్లుకాగా.. 30 రోజులుగా చెల్లించని(ఎన్‌పీఏలుకాని) రుణాల విలువ రూ. 1,700 కోట్లుగా నమోదయ్యాయి. ఇందుకు భారీ ఇన్‌ఫ్రా ఖాతా కారణమైనట్లు బ్యాంక్‌ పేర్కొంది. రికవరీలు, అప్‌గ్రేడ్స్‌ ద్వారా రూ. 1,532 కోట్లు జమయ్యాయి. ఈ ఖాతా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. కనీస మూలధన నిష్పత్తి 17.7 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు