విశాఖలో యోకొహామా టైర్ల ప్లాంట్‌

14 Sep, 2020 05:15 IST|Sakshi

రూ. 1,240 కోట్ల పెట్టుబడి

2023 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి

ముంబై: జపాన్‌ దిగ్గజం యోకొహామా గ్రూప్‌లో భాగమైన అలయన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనిపై 165 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,240 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనుంది. 2023 తొలి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి రాగలదని యోకొహామా ఇండియా చైర్మన్, ఏటీజీ డైరెక్టర్‌ నితిన్‌ మంత్రి వెల్లడించారు. దీనితో కొత్తగా 600 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆఫ్‌–హైవే టైర్ల తయారీ సంస్థ అయిన ఏటీజీకి ప్రస్తుతం 5,500 మంది సిబ్బంది ఉన్నారు. దేశీయంగా గుజరాత్‌లోని దహేజ్, తమిళనాడులోని తిరునల్వేలిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. విశాఖలో ఏర్పాటు చేసేది మూడోది అవుతుంది. తాము గత మూడేళ్లుగా ఫ్యాక్టరీకి అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నామని, కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి ముందే వైజాగ్‌ను ఎంపిక చేసుకున్నామని తెలి పారు.  ఏటీజీకి ఇజ్రాయెల్‌లో 45,000 టన్నుల ప్లాంటుతో పాటు ప్రధాన అభివృద్ధి, పరిశోధన (ఆర్‌అండ్‌డీ) కేంద్రమూ ఉంది. దేశీయంగా తమిళనాడు ప్లాంటులోనూ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఉంది.  

పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం..
అచ్యుతాపురం పారిశ్రామిక పార్కులోని స్పెషల్‌ ప్రాజెక్టుల జోన్‌లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్లో ఆఫ్‌–హైవే టైర్లను తయారు చేయనున్నారు. దీని రోజువారీ సామర్థ్యం 55 టన్నులు (రబ్బరు బరువు)గా ఉండనుంది. ప్రస్తుతం రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.3 లక్షల టన్నులుగా ఉండగా, ఈ ఫ్యాక్టరీతో మరో 20,000 టన్నులు పెరగనుంది. దహేజ్, తిరునల్వేలి ఫ్యాక్టరీలు ప్రధానంగా మూడు ఆఫ్‌–హైవే టైర్ల బ్రాండ్లు తయారు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలయన్స్‌ పేరిట, నిర్మాణ.. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం గెలాక్సీ పేరిట, అటవీ ప్రాంతాల్లో వినియోగించే వాహనాల కోసం ప్రైమెక్స్‌ పేరిట టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 90 శాతం ఉత్పత్తిని 120 పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. యోకొహామా గ్రూప్‌నకు జపాన్, ఇండియా, ఇజ్రాయెల్, వియత్నాంలలో ఎనిమిది ఆఫ్‌–హైవే ప్లాంట్లు ఉన్నాయి. 2016లో ఏటీజీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,000 రకాల టైర్లను విక్రయిస్తోంది.    
 

మరిన్ని వార్తలు