‘యోనో’ విలువ... రూ.3 లక్షల కోట్ల పైమాటే 

10 Sep, 2020 06:36 IST|Sakshi

అతిపెద్ద, లాభదాయక స్టార్టప్‌: రజనీష్‌ 

ముంబై: ఆరంభించిన మూడేళ్ల కాలంలోనే ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘యోనో’ 40 బిలియన్‌ డాలర్లకు పైగా వ్యాల్యూషన్‌తో అతిపెద్ద స్టార్టప్‌గా అవతరించినట్టు బ్యాంకు చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య వాణిజ్య బిల్లులు చెల్లింపులకు గాను ‘భారత్‌ డ్రాఫ్ట్‌’ పేరుతో ఒక బిజినెస్‌ టు బిజినెస్‌ (బీటూబీ) ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. 2017 నవంబర్‌లో ఎస్‌బీఐ యోనో యాప్, వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఎస్‌బీఐ కస్టమర్లు బ్యాంకింగ్‌ సేవలను, పెట్టుబడులను, షాపింగ్‌ను ఒకే వేదికగా చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజనీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. యోనో లాభదాయక ప్లాట్‌ఫామ్‌ అని, ఎస్‌బీఐలో భాగంగా ఉన్నందున దీని విలువ ఎవరికీ తెలియదన్నారు. ‘‘ఒకవేళ బ్యాంకు వెలుపల ఉండి ఉంటే దీని విలువ ఎంత లేదన్నా 40–50 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. ప్రతిరోజూ 70 వేల మంది కస్టమర్లను ఈ ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చుకుంటున్నాము. గత 6 నెలల్లోనే 2.7 కోట్ల మంది యూజర్లు ఇందులో చేరారు. మెకిన్సే, ఐబీఎం సాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశాం. రోజూ యోనో వేదికగా రూ.70 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నాము’’ అంటూ రజనీష్‌ వివరించారు. సైబర్‌ భద్రత, మోసాల నివారణ విషయంలో కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు