పాత కార్లలో యూత్‌ రైడ్‌

23 Dec, 2021 04:30 IST|Sakshi

హ్యాచ్‌బ్యాక్స్‌కు 43 శాతం మంది మొగ్గు

అధిక మైలేజీనిచ్చే చవక కార్లకు డిమాండ్‌

2020–21లో రోడ్డెక్కిన 38 లక్షల యూనిట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొన్నేళ్ల క్రితం వరకు కొత్త కారు కావాలంటే షోరూంకు వెళ్లి కొన్ని గంటల్లోనే నచ్చిన వాహనంతో రోడ్డుపై దూసుకుపోయేవారు. కొన్ని మోడళ్లకే కొద్ది రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పరిస్థితులు మారిపోయాయి. ఏ మోడల్‌ కారు కావాలన్నా తప్పనిసరిగా కొన్ని వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికంతటికీ కారణం సెమికండక్టర్ల కొరత. మరోవైపు ముడి సరుకు వ్యయాలు భా రం కావడంతో వాహనాల ధరలను తయారీ కం పెనీలు ఎప్పుడూ లేని విధంగా క్రమం తప్పకుం డా పెంచుతూ పోతున్నాయి. దీంతో పాత కార్లకు డిమాండ్‌ అనూహ్యంగా అధికమైంది. అయితే ప్రీ–ఓన్డ్‌ కార్లను కొనేందుకు నవతరం ముందంజలో ఉన్నారని ఆన్‌లైన్‌ యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ప్లేస్‌ కంపెనీ కార్స్‌24 నివేదిక చెబుతోంది.

కొనుగోలుదార్లదే మార్కెట్‌..
పరిశ్రమలో అవ్యవస్థీకృత రంగానిదే 95 శాతం వాటా. రూ.2 లక్షల పెట్టుబడితో ఔత్సాహికులు ఈ రంగంలోకి  ప్రవేశిస్తున్నారు. ఇక కొనుగోలుదార్లు వాహనం ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. కండీషన్‌నుబట్టి ధర నిర్ణయం అవుతోంది. పైగా కారు ఎక్కడ కొన్నా బ్యాంకులు రుణం ఇవ్వడం కలిసి వస్తోంది. వాహనం ఒకట్రెండేళ్లు వాడి 10,000 కిలోమీటర్లలోపు తిరిగితే యజమాని చెప్పిందే ధర. అదే రెండేళ్లు దాటితే కొనుగోలుదారు చెప్పిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అయిదేళ్లలోపు వాడిన కార్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారని వసంత్‌ మోటార్స్‌ ఎండీ కొమ్మారెడ్డి సందీప్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలుదార్లదే మార్కెట్‌ అని ఆయన అన్నారు.

ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లకు సై..
పాత కార్ల కొనుగోలుదార్లలో యువత వాటా ఏకంగా 80 శాతం ఉంది. యాప్, వెబ్‌ ఆధారిత వేదికలు వృద్ధి చెందేందుకు వీరు దోహదం చేస్తున్నారు. వాహన ధరలు పెరుగుతుండడం, మహమ్మారి కారణంగా వచ్చిన జీవనశైలి మార్పులు, ఆన్‌లైన్‌ కంపెనీల దూకుడు.. వెరళి డిజిటల్‌ వేదికల జోరుకు కారణం అవుతున్నాయి. యువ కస్టమర్లలో పురుషులదే పైచేయి. మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్ల విషయానికి వస్తే హ్యాచ్‌బ్యాక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఏకంగా 43% ఉంది. ఎస్‌యూవీలకు 26% మంది సై అంటున్నారు. పెట్రోల్‌ వాహనాలకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. యూజ్డ్‌ కార్‌ ఏ స్థితిలో ఉందన్నదే కొనుగోలుదార్లకు కీలక అంశం.  

ఇదీ దేశీయ మార్కెట్‌..
భారత్‌లో 2020–21లో 38 లక్షల పాత కార్లు చేతులుమారాయి. ఇందులో 5–7 ఏళ్లు వాడిన వాహనాల వాటా 31 శాతం, 8–10 ఏళ్లవి 29 శాతం ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 15 శాతం పెరగనుంది. ఏటా 12–14 శాతం వృద్ధితో 2025–26 నాటికి ఈ సంఖ్య 70 లక్షల యూనిట్ల పైచిలుకు నమోదు కానుందని నివేదికలు చెబుతున్నాయి. చవకగా ఉండి అధిక మైలేజీ ఇచ్చే కార్ల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు 27.11 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనినిబట్టి పాత కార్లకు ఉన్న డిమాండ్‌ అర్థం అవుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ 20–30 శాతం దూసుకెళ్లింది. ముఖ్యంగా దక్షిణాదిన పాత కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్‌ కారణంగా వ్యక్తిగతంగా వాహనం ఉండాలన్న భావన ప్రజల్లో బలపడుతోంది.   

మరిన్ని వార్తలు