జువెలరీ షోరూమ్‌లో స్వచ్చమైన బంగారాన్ని గుర్తించడం ఎలా..?

7 Jul, 2021 16:22 IST|Sakshi

మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆభరణాల షోరూమ్‌లోకి వెళ్లినప్పుడు మీ మనస్సులో ఉన్న బడ్జెట్ గురించి ఆభరణాల వ్యాపారికి చెప్పిన వెంటనే, అతను మీ ముందు విభిన్న రకాల బంగారు ఆభరణాల సెట్ డిజైన్లను ఉంచుతారు. బంగారం ధర అనేది స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్వచ్ఛమైన బంగారం కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు స్వచ్ఛమైనవా? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉన్నాయని మీరు ఎలా ధృవీకరిస్తారు?. దీనికి సంబందించి ఆగ్మోంట్ డైరెక్టర్ కేతన్ కొఠారి బంగారం కొనుగోలు ప్రక్రియ, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, దేశంలో కొత్త హాల్ మార్క్ నియమాలు, హాల్ మార్క్ చేయని మీ పాత బంగారు ఆభరణాల గురుంచి వివరణ ఇచ్చారు. 

కేతన్ కొఠారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం వివిధ రకాల స్వచ్ఛత స్థాయిల్లో ఉంటుంది. బంగారం అనేది అతి తక్కువ స్వచ్ఛత కలిగిన 10 క్యారెట్ల బంగారం నుంచి అత్యధిక స్వచ్చత కలిగిన 24 క్యారెట్ల బంగారం వరకు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని ఎందుకు అంటారు అంటే? దీనిలో వేరే ఇతర లోహాలను కలపరు. ఇది మృదువుగా ఉంటుంది. దీనిని బంగారు కడ్డీలు, నాణేలు, విద్యుత్ పరికరాలు, వైద్య పరికరాల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

వెండి, జింక్, నికెల్ వంటి ఇతర మిశ్రమలోహాలు బంగారం కలిగి ఉన్న వాటిని 23కె, 22కె, 22కె, 20కె, 18కె, 14కె, 10కె బంగారం అని అంటారు. ఈ ఇతర గ్రేడ్ల బంగారం మన్నికైనవి, దృఢమైనవి. మన భారత దేశంలో ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం వాడుతారు.

కొత్త హాల్ మార్క్ నిబంధనలు ఏమిటి?
బంగారం కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు బంగారు ఆభరణాల విషయంలో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ప్రభుత్వ లోగో. హాల్‌మార్కింగ్‌ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసే వినియోగ‌దారుడు మోస‌పోవద్దని ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేసే సమయంలో స్వచ్చమైన ఆభరణాలను గుర్తించడం కష్టమవుతోంది.  స్వచ్చమైన బంగారం, నకిలీ బంగారం అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్‌ విధానాన్ని కేంద్రం తీసుకోచింది. ప్రస్తుతం 256 జిల్లాల్లో మాత్రమే హాల్ మార్క్ నిబంధనలు అమలు చేస్తున్నారు. 

ఆభరణాల షోరూమ్ కు వెళ్లినప్పుడు హాల్ మార్క్ ఆభరణాలు గుర్తుంచడం ఎలా?
గోల్డ్ హాల్ మార్క్ ఆంక్షలు దశలవారీగా అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 256 జిల్లాల్లో ఆభరణాల దుకాణాలు హాల్ మార్క్ లోగోను ముద్రిస్తున్నాయి. కొనుగోలుదారుడు షోరూమ్లోకి ప్రవేశించినప్పుడు జ్యూయలర్ బీఐఎస్ రిజిస్టర్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం కొరకు బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ అడగాలి. కొనుగోలుదారుడు స్వచ్ఛత కోసం నాలుగు సంకేతాలను పరిశీలించిన తరువాత మాత్రమే హాల్ మార్క్ చేయబడ్డ ఆభరణాలను కొనుగోలు చేయాలి. అలాగే కొన్న తర్వాత ఆభరణాల షోరూమ్ నుంచి బిల్లును తీసుకోవాలి. 

బంగారు ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవడం కోసం ఆ ఆభరణాలపై నాలుగు సంకేతాలు గల ముద్ర ఉంటుంది. ఆ ముద్ర కనిపించకపోతే 10ఎక్స్ భూతద్దం ఉపయోగించి దానిని మీకు ప్రదర్శించమని ఆభరణాల వ్యాపారిని అడగండి. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. మీకు నగల వ్యాపారి నకిలీ ఆభరణాలు మీకు విక్రయిస్తే స్వచ్చత, బరువు కోసం మీరు చెల్లించిన టెస్టింగ్ ఛార్జీలతో వచ్చిన తేడాకు రెండు రెట్లు కొనుగోలుదారుడికి షాప్ ఓనర్ రీఎంబర్స్ మెంట్  చేయాలి.

కొనుగోలుదారుడు గమనించాల్సిన సంకేతాలు ఏమిటి?
ఆభరణాలపై నాలుగు ప్రధాన హాల్ మార్కింగ్ గుర్తులు ఉంటాయి. త్రిభుజం గుర్తు అనేది బీఐఎస్ మార్క్ సూచిస్తే, స్వచ్ఛతను 916 నెంబర్(22 క్యారెట్)తో సూచిస్తారు. తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు, ఇక మిగిలనవి హాల్ గుర్తింపు పొందిన ఆస్సాయిగ్ సెంటర్ మార్క్, అది తయారు చేసిన సంవత్సరం. భారతదేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయవచ్చు.

పాత ఆభరణాల కొనుగోలు, అమ్మకాలు ఎలా?
మీ పాత బంగారు ఆభరణాల విలువ గురించి ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఇది ఇప్పటికీ చట్టబద్ధం. బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ లేనప్పటికీ, ఆభరణాల తయారీదారులు దానిని కస్టమర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఆభరణాల వ్యాపారి దాని మీద హాల్ మార్క్ లోగో ముద్రన కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనుగోలుదారులకు విక్రయించవచ్చా? 
అలాంటి అవకాశం లేదు. బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 29 ప్రకారం, హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయిస్తే నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా లక్ష రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి వరకు భారత దేశ ప్రజల దగ్గర 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఆభరణాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు