కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు.. కోట్ల టర్నోవర్‌తో అందరికీ షాకిచ్చారు!

29 Sep, 2022 12:35 IST|Sakshi

వ్యర్థాల నుంచి కంపోస్ట్ చేయడం లేదా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ పద్ధతి మనందరికీ తెలుసు, కానీ మనం ధరించే బట్టలు కూడా వ్యర్థాలతో తయారు చేయవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఓ దంపతులు మాత్రం అలా ఆలోచించారు కాబట్టే, కోడి ఈకలతో మనం ధరించే బట్టలు తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వారి ఐడియా విని ఎగతాళి చేసిన వాళ్లే ఆశ్చర్యపోయేలా చేశారు జైపూర్‌కి చెందిన ముదిత, రాధేష్. కాలేజీలో పునాది పడ్డ ఈ ఐడియా, తమ కఠోర శ్రమ, అభిరుచితో దాన్ని కంపెనీగా మార్చిన ఈ దంపతులు ప్రస్తుతం కోట్లలో టర్నోవర్‌ని సొంతం చేసుకున్నారు. 

అనుకోకుండా ఆలోచన.. అదే వ్యాపారంగా మారి
ముదిత మాట్లాడుతూ.. జైపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లో రాధేష్‌తో ఎంఏ చేస్తున్నప్పుడు, వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే దానిపై ప్రాజెక్ట్ చేశాను. ఒకరోజు, రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న కసాయి దుకాణంలో నిలబడి ఉండగా కోడి ఈకలను చేత్తో తాకాడు. అనుకోకుండా అతనికి ఓ ఆలోచన వచ్చింది దాన్నే ప్రాజెక్ట్‌గా మార్చాం. ఆపై ఆ ప్రాజెక్ట్‌ ఐడియాతోనే బిజినెస్‌ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.

కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు
వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు సుమారు 8 సంవత్సరాలు పట్టింది. 2010లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2018లో పూర్తయింది. ఇందుకోసం చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ వైపు.. రాధేష్ కుటుంబం పూర్తిగా శాఖాహారం కాబట్టి, వాళ్లు ఈ వ్యాపారాన్ని నిరాకరించారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ల కుటుంబం ఆదుకోలేదు. ఈ క్రమంలో వాళ్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

మరో వైపు.. ఇంతకు ముందు ఎవరూ అలాంటి బట్టను తయారు చేయలేదు కాబట్టి, పుస్తకాలలో, ఇంటర్నెట్‌లో కూడా దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చాలా పరిశోధన తర్వాత, కోడి ఈకలను బట్టలుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. ఇక్కడ వరకు పట్టుదలతో ముందుకు సాగిన వీళ్లకు మళ్లీ వీటి సేల్స్‌ తలనొప్పిగా మారింది. 

కానీ తొందరగానే కోడి ఈకలతో తయారు చేసిన శాలువాలకు ఇక్కడి కంటే విదేశాల్లో దీనికి అధిక డిమాండ్ ఉన్న విషయాన్ని గమనించారు. అప్పటి నుంచి వారి ఉత్పత్తులు చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చిన్న కుటీర పరిశ్రమ స్థాయిలో మొదలైన వారి ఆలోచన రూపమే.. గత రెండున్నరేళ్లలో కంపెనీ దాదాపు 7 కోట్ల వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది.  ప్రస్తుతం ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు.

చదవండి: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త సేవలు రాబోతున్నాయ్‌!

మరిన్ని వార్తలు