యూట్యూబ్‌ చేతికి సిమ్‌సిమ్‌ యాప్‌

21 Jul, 2021 00:20 IST|Sakshi

భారత వీడియో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం కొనుగోలు

న్యూఢిల్లీ: వీడియో షేరింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ తాజాగా భారత్‌కు చెందిన వీడియో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాం సిమ్‌సిమ్‌ యాప్‌ను కొనుగోలు చేసింది. దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలు, రిటైలర్లను కొత్త కస్టమర్లకు చేరువ చేసేందుకు ఈ డీల్‌ తోడ్పడగలదని యూట్యూబ్‌ మాతృసంస్థ గూగుల్‌ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం వెల్లడించలేదు. మరికొన్ని వారాల్లో కొనుగోలు లావాదేవీ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. సిమ్‌సిమ్‌ యాప్‌లో ఎటువంటి మార్పులు ఉండవని, ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని గూగుల్‌ పేర్కొంది. సిమ్‌సిమ్‌ ఆఫర్లను యూట్యూబ్‌ వీక్షకులకు ఏ విధంగా చూపవచ్చన్న దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది.

స్థానిక వ్యాపార సంస్థలు, ప్రభావితం చేసేవారు, కస్టమర్లను సిమ్‌సిమ్‌ అనుసంధానిస్తుంది. స్థానిక వ్యాపార సంస్థల ఉత్పత్తుల గురించి క్రియేటర్లు ..ఇందులో వీడియో రివ్యూలు ఉంచుతారు. వీక్షకులు ఆయా ఉత్పత్తులను నేరుగా యాప్‌ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని వీడియోలు ప్రస్తుతం హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉంటున్నాయి. యూజర్లు ఆన్‌లైన్‌లో సులభతరంగా కొనుగోళ్లు చేసేందుకు, విక్రేతలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిమ్‌సిమ్‌ను ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అమిత్‌ బగారియా, కునాల్‌ సూరి, సౌరభ్‌ వశిష్ట ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు