దేశ జీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.. స్పందించిన కేంద్రం!

13 Feb, 2023 17:28 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో రూ. 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి రూ.1,72,913 రూపాయలకు పెరిగిందని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. 

దేశ జాతీయ ఆదాయంలో టాప్ 1 శాతం కలిగిన ధనికులు 40 శాతం, టాప్ 10 శాతం కలిగిన ధనికులు 57 శాతం ఉంటే, దిగువనున్న 57 శాతం మంది ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారన్న వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్-2022 గణాంకాలు వాస్తవమేనా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. 

ఆ ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు -2022 నివేదిక సందేహాస్పదంగా ఉండడంతో దానిని  పరిగణలోకి తీసుకోలేమని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా కోరిన వివరాలపై వ్యాఖ్యానించలేమని తెలిపారు. దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, వీక్షిత్ భారత్ ఉద్దేశాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై  
జీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఎంపీ విజయ సాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలని అన్నారు.

ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు