భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా ఎన్నిక

4 May, 2023 18:53 IST|Sakshi

ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో వాటికి దిశానిర్దేశం చేసే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్‌ అజయ్‌ బంగా ఎన్నికవడం ఇండియాకు గర్వకారణం. ఇండియాలోని పుణె ఖడ్కీ కంటోన్మెంటులో పంజాబీ సిక్కు సైనికాధికారి కుటుంబంలో జన్మించిన 63 ఏళ్ల అజయ్‌ పాల్‌ సింగ్‌ బంగా తర్వాత దేశంలోని అనేక నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలులో కూడా చదివిన బంగా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు.

ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి స్థాపించిన ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ అధ్యక్ష పదవికి కేవలం అమెరికన్లకు ఎన్నికయ్యే అవకాశం ఇవ్వడం, ఈ బ్యాంక్‌ జోడు సంస్థ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సారధి పదవిని ఐరోపా దేశీయుడికే ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్ల ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది.

అయితే, ఈసారి 24 మంది బోర్డు సభ్యులు పాల్గొన్న ఓటింగ్‌ ద్వారా బంగా ఎన్నిక బుధవారం నిర్వహించారు. బోర్డులో సభ్యత్వం ఉన్న రష్యా ప్రతినిధి ఈ ఎన్నిక ఓటింగులో పాల్గొనలేదు. భారతదేశంలో పుట్టినాగాని కొన్నేళ్లు దేశంలో పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ పెప్సికో, మాస్టర్‌ కార్డ్‌ వంటి దిగ్గజ కంపెనీల్లో బంగా పనిచేశారు. అలా ఆయన అమెరికా పౌరుడు కావడంతో ప్రపంచ బ్యాంక్‌ సారధిగా ఎన్నికవడం వీలైంది.

జూన్‌ 2 నుంచి ఐదేళ్లు పదవిలో
జూన్‌ 2న కొత్త పదవి స్వీకరించే బంగాను ఈ పదవికి బుధవారం ఎన్నుకునే ముందు సోమవారం ప్రపంచ బ్యాంక్‌ బోర్డు సభ్యులు నాలుగు గంటలపాటు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ అత్యున్నత పదవికి బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫిబ్రవరి నెలాఖరులో ప్రతిపాదన రూపంలో నామినేట్‌ చేశారు. ఆయన నామినేషన్‌ ను బ్యాంకు బోర్డు ఖరారు చేయడం భారతీయ అమెరికన్లతో పాటు భారతీయులకు గర్వకారణంగా భావిస్తున్నారు.

గత పాతికేళ్లలో పలువురు భారతీయ అమెరికన్లు అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, సంస్థల అధిపతులుగా నియమితులై, విజయవంతంగా వాటిని నడుపుతూ మంచి పేరు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ జూన్‌ ఒకటి వరకూ పదవిలో ఉంటారు. ఆయన గతంలో అమెరికా ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన గొప్ప ఆర్థికవేత్త.

మాల్పాస్‌ మాదిరిగానే బంగా కూడా ఐదేళ్లు బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ గా పదవిలో జూన్‌ 2 నుంచి కొనసాగుతారు. 1944 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ పదవిని 13 మంది అమెరికన్లు నిర్వహించారు. బాంగాకు ముందు ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పుట్టిన జిమ్‌ యాంగ్‌ కిమ్‌ (2012–2019) కూడా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. బంగా మాదిరిగానే 1959లో జన్మించిన యాంగ్‌ ఐదేళ్ల వయసులో తన కుటుంబంతో పాటు అమెరికా వలసపోయి స్థిరపడి అమెరికా పౌరుడయ్యారు.

గతంలో ఈ బ్యాంక్‌ అధ్యక్షులుగా పనిచేసిన ఆర్థికరంగ నిపుణుల్లో యూజీన్‌ ఆర్‌ బ్లాక్‌ (1949–1962), రాబర్ట్‌ ఎస్‌ మెక్‌ నమారా (1968–1981)లు 12 ఏళ్లు దాటి పదవిలో ఉండడం విశేషం. మెక్‌ నమారా కాలంలోనే ఈ అంతర్జాతీయ బ్యాంక్‌ తన కార్యకపాలు విస్తరించింది. బ్యాంకు సిబ్బందితోపాటు అనేక దేశాలకు రుణాలు ఇవ్వడం పెంచింది. పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టింది. మెక్‌ నమారా ఈ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ గా ఎన్నికవడానికి ముందు అమెరికా రక్షణ మంత్రిగా పనిచేశారు.

మొదటిసారి ఒక భారతీయ అమెరికన్‌ ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టడం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికం తగ్గించి, సంపద విస్తరించడానికి కృషి చేసే అత్యంత ముఖ్యమైన సంస్థల్లో ఒకటైన ప్రపంచబ్యాంక్‌ సారధిగా బంగా అత్యధిక సభ్యుల ఆమోదంతో ఎన్నికవడం హర్షణీయమని అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్‌ అభినందించడం భారతీయ అమెరికన్ల సమర్ధతకు అద్దంపడుతోంది.


విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ

మరిన్ని వార్తలు