దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!

28 Feb, 2023 12:55 IST|Sakshi

బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు  ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్‌ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. 

యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్‌, డీఎక్స్ జీఆర్‌ పేరుతో లాంచ్‌ చేశాయి. దేశీయ  అవసరాలు, రోడ్లు,  వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్‌ చేస్తున్నట్టు యూలు, బజాజ్‌ ఆటో ఒక  ప్రకటనలో తెలిపాయి.

మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్  ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి  పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని  సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. 

నెక్ట్స్‌జెన్‌  మేడ్-ఫర్ ఇండియా వాహనాలు  అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని  బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు