జీ- అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. హైజంప్‌ 

19 Aug, 2020 15:20 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌- జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జూమ్‌

విమానాశ్రయాల ఒప్పందాలు- అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్(జీల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు కారణంగా కంటెంట్‌ ప్రొడక్షన్‌కు సమస్యలు ఎదురైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా జీల్‌ పేర్కొంది. అయితే ప్రస్తుతం తిరిగి ప్రొడక్షన్‌ తదితర పనులు ప్రారంభంకావడంతో ఇకపై మెరుగైన పనితీరు చూపగలమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 196 వద్ద ట్రేడవుతోంది. 

క్యూ1 ఇలా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) కాలంలో జీ నికర లాభం రూ. 29.3 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 530 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2112 కోట్ల నుంచి రూ. 1338 కోట్లకు క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ. 1187 కోట్ల నుంచి రూ. 421 కోట్లకు భారీగా నీరసించినట్లు జీ తెలియజేసింది. కోవిడ్‌-19 కారణంగా ఇతర త్రైమాసిక ఫలితాలతో వీటిని పోల్చిచూడ తగదని తెలియజేసింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌
ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ(ఏఏఐ) ప్రతిపాదనను నేడు కేంద్ర కేబినెట్‌ పరిశీలించనుందన్న అంచనాలతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 233 వద్ద ట్రేడవుతోంది. తొలి దశ ప్రయివేటైజేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బిడ్డింగ్‌ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆరు ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. వీటిలో అహ్మదాబాద్‌, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు ఏఏఐ నుంచి ఒప్పందాలను కుదుర్చుకుంది. మిగిలిన మూడు ఒప్పందాలు వాయిదా పడ్డాయి. పబ్లిక్‌ ప్రయివేట్‌ భాగస్వామ్యం కింద గువాహటి, జైపూర్‌, తిరువనంతపురం విమానాశ్రయాల అభివృద్ధికి ఒప్పందాలు కుదిరే వీలున్నట్లు తెలుస్తోంది. అయితే  విమానాశ్రయాల ప్రయివేటైజేషన్‌పై విచారణ జరుగుతున్న కారణంగా కోర్డు ఆదేశాలకు లోబడి ఒప్పందాలు కుదరవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. రూ. 1,000 కోట్ల ముందస్తు చెల్లింపులకు అదానీ గ్రూప్‌ మరింత గడువు కోరిన నేపథ్యంలో అహ్మదాబాద్‌, మంగళూరు, లక్నో ఎయిర్‌పోర్టుల అప్పగింత పెండింగ్‌లో పడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు