జీ, సోనీ విలీనం దిశగా మరో ముందడుగు

23 Dec, 2021 01:33 IST|Sakshi

ఒప్పందాలపై సంతకాలు

న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ)లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (జీల్‌) విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడింది. విలువ మదింపునకు సంబంధించి చర్చల ప్రక్రియకు గడువు ముగియడంతో నెట్‌వర్క్‌లు, డిజిటల్‌ అసెట్స్, ప్రొడక్షన్‌ కార్యకలాపాలు, ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసే విధంగా ఇరు సంస్థలు నిర్దిష్ట ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

జీల్, ఎస్‌పీఎన్‌ఐ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్‌పీఎన్‌ఐలో జీల్‌ విలీన డీల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎస్‌పీఈ) 1.575 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. దానికి ప్రతిగా 50.86 శాతం వాటాలు దక్కించుకుంటుంది. జీల్‌ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులు) 3.99 శాతం, ఇతర జీల్‌ షేర్‌హోల్డర్లకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. డీల్‌ పూర్తయ్యాక విలీన సంస్థను స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేస్తారు.

జీల్‌ సీఈవో పునీత్‌ గోయెంకా ఎండీ, సీఈవోగా కొనసాగుతారు. ‘భారతీయ వినియోగదారులకు మెరుగైన వినోదం అందించేందుకు..  మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన 2 టీమ్‌లు, కంటెంట్‌ క్రియేటర్లు, ఫిలిమ్‌ లైబ్రరీలను ఒక తాటిపైకి తెచ్చే దిశగా మా ప్రయత్నాల్లో ఇది కీలక అడుగు‘ అని ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఎస్‌పీఈ చైర్మన్‌ (గ్లోబల్‌ టెలివిజన్‌ స్టూడియోస్‌) రవి అహుజా తెలిపారు. వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్‌ అందించేందుకు ఈ డీల్‌ దోహదపడగలదని పునీత్‌ గోయెంకా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు