Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..

28 Oct, 2022 06:29 IST|Sakshi

విలీన నిబంధనలకు జీ–సోనీ ఓకే

న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్‌ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్‌ – ఎస్‌పీఎన్‌ఐ)లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (జీల్‌), బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ (బీఈపీఎల్‌) విలీనానికి అక్టోబర్‌ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్‌ ఇండియా లేదా వయాకామ్‌18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి.

మరిన్ని వార్తలు