జీ వాటాదారులు ఏకంకావాలి

12 Oct, 2021 06:25 IST|Sakshi

యాజమాన్య మార్పిడిని కోరుతున్న ఇన్వెస్కో

వాటాదారులకు లేఖ ద్వారా విన్నపం

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌(జీల్‌) యాజమాన్య మార్పిడికి డిమాండ్‌ చేస్తున్న ఇన్వెస్కో తాజాగా కంపెనీ వాటాదారులకు లేఖ రాసింది. సోనీ గ్రూప్‌తో జీల్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రమోటరేతర వాటాదారులంతా ఏకంకావాలంటూ అభ్యరి్థంచింది. ఈ డీల్‌ ద్వారా వాటాదారులను నష్టపరుస్తూ సుభాష్‌ చంద్ర కుటుంబం లబ్ది పొందే వీలున్నట్లు లేఖలో ఆరోపించింది. జీల్‌లో 7.74 శాతం వాటా ను కలిగిన ఇన్వెస్కో ఓపెన్‌ లెటర్‌ ద్వారా మరోసారి జీల్‌ బోర్డును పునర్వ్యవస్థీకరించాలం టూ డిమాండ్‌ చేసింది. ఇందుకు వీలుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని పేర్కొంది. జీల్‌ సీఈవో పునీత్‌ గోయెంకాసహా ఇద్దరు ఇతర డైరెక్టర్లను తొలగించమంటూ ఇన్వెస్కో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

డీల్‌ ఇలా..: గత నెలలో సోనీ గ్రూప్‌నకు చెందిన దేశీ విభాగం జీ కొనుగోలుకి తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రెండు సంస్థల విలీనాన్ని చేపట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీ ఇండియా వాటాదారులకు 53 శాతం వాటా లభించనుండగా.. మిగిలిన భాగం జీ వాటాదారులకు చెందనుంది. డీల్‌ ప్రకారం పోటీపడకుండా ఉండే క్లాజుతో చంద్ర కుటుంబానికి 2 శాతం అదనపు వాటాను బహుమతిగా ఇవ్వడాన్ని ఇన్వెస్కో లేఖ ద్వారా తప్పుపట్టింది. అంతేకాకుండా వీరి వాటాను 4 శాతం నుంచి 20 శాతానికి పెరిగేందుకు వీలు కలి్పంచడాన్ని అక్రమ చర్యగా పేర్కొంది. జీల్‌లో ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌ ఎల్‌ఎల్‌సీతో కలసి ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. కంపెనీ టేకోవర్‌కు ఆసక్తి ఉంటే 75 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించమంటూ గత వారం సుభాష్‌ చంద్ర సవాల్‌ విసిరిన నేపథ్యంలో ఇన్వెస్కో తాజా లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్వెస్కో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు