జొమాటో కంటే ముందుగానే...10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ ప్రారంభించిన గ్రాసరీ సంస్థ..!

18 Apr, 2022 21:06 IST|Sakshi

జెప్టో ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది..మెరుపు వేగంతో కేవలం పది నిమిషాల్లోనే ఆన్‌లైన్‌ గ్రాసరీ సేవలను అందిస్తుంది. కాగా ఇప్పుడు గ్రాసరీ సేవలతో పాటుగా ఫుడ్‌ డెలివరీ సేవలను అందించేందుకు సిద్దమైంది జెప్టో.  

వచ్చేసింది...జెప్టో ‘కేఫ్‌’
జెప్టో ‘కేఫ్‌’ అనే సొంత యాప్‌ ద్వారా ఫుడ్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద తొలుత ముంబై మహానగరంలో 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీ సేవలను జెప్టో మొదలుపెట్టింది. జెప్టో ప్రస్తుతం రూ. 99 కంటే ఎక్కువ ఫుడ్‌ ఆర్డర్స్‌పై ఉచితంగా డెలివరీ చేస్తోంది. పది నిమిషాల్లో ఫుడ్‌ను అందించేందకుగాను జెప్టో ముంబైకి చెందిన స్టార్టప్ బ్లూ టోకాయ్ కాఫీ, చాయోస్, గురుకృపా స్నాక్స్, సాసీ టీస్పూన్ వంటి రెస్టారెంట్లతో జత కట్టింది. ప్రస్తుతం కేవలం పది నిమిషాల్లో తయారయ్యే టీ, , సమోసాలు, కాఫీ, శాండ్‌విచ్స్‌ వంటి ఆహర పదార్థాలను డెలివరీ చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్నీ నగరాల్లో, ఎక్కువ ఫుడ్‌ ఐటెమ్స్‌ను డెలివరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్‌ పాలిచా వెల్లడించారు. 

జొమాటో కంటే ముందుగానే..
కొద్ది రోజుల క్రితం..పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ సేవలను అందిస్తామని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌ జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. జొమాటోతో పాటుగా ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు పది నిమిషాల ఫుడ్‌ డెలివరీపై ప్రణాళికలను కూడా రచిస్తున్నాయి. ఇక జొమాటో ప్రకటన సోషల్‌మీడియా చర్చకు దారితీసింది. పది నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అంతేకాకుండా పది నిమిషాల ఫుడ్‌ డెలివరీ ప్రకటనపై ఏకంగా పార్లమెంట్‌లో కూడా చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీపై జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ వివరణను కూడా ఇచ్చారు. ఇప్పుడు జొమాటోకు గట్టిషాక్‌ను ఇస్తూ ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ సేవలను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. 

చదవండి: ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్‌ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..! కారణం అదే..?

మరిన్ని వార్తలు