Women's Day: లవ్‌ మ్యారేజ్‌.. భార్యకి క్యాన్సర్‌.. ఈ బిలియనీర్‌ ఏం చేశాడంటే?

8 Mar, 2022 13:33 IST|Sakshi

జెరోదా.. స్టాక్‌మార్కెట్‌తో పరిచయం ఉన్న వారికి బాగా తెలిసి కంపెనీ. స్టార్టప్‌గా మొదలై యూనికార్న్‌ కంపెనీగా మారింది. కనీసం డిగ్రీ కూడా లేకుండా ఇంత పెద్ద కంపెనీకి సీఈవో అయ్యాడు నితిన్‌ కామత్‌. సంపాదనలోనే కాదు భార్యపై ప్రేమను చాటడం సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడంలో కూడా ముందున్నాడు ఈ నియో బిలియనీర్‌.

జెరోదా స్థాపించకముందు ఓ కాల్‌సెంటర్‌లో పని చేశాడు నితిన్‌ కామత్‌. అక్కడే పరిచయమైంది సీమా పాటిల్‌. ఆ తర్వాత ఈ ప్రేమ.. ఏడుడగులతో పెళ్లి బంధంలోకి ఎంటరైంది. ఈ క్రమంలో 2010లో జెరోదా ప్రారంభించడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం చకచకా జరిగిపోయాయి. చిన్న వయసులోనే బిలియనీర్‌ అయ్యాడు నితిన్‌ కామత్‌. కానీ ఇంతలోనే వారి జీవితం ఊహించని మలుపు తీసుకుంది.

ఎవరికి చెప్పుకోలేక
ఆరోగ్యం బాగాలేదని హస్పిటల్‌కి వెళితే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టుగా తెలిసింది. ఆ నిజం తట్టుకోవడం ఆ దంపతులకు కష్టమైంది. మూడు వారాల పాటు ఎవరికీ చెప్పలేదు. ఎవరు ఏమనుకుంటారో అని భయం. కానీ క్యాన్సర్‌ని ఎక్కువ కాలం దాచి పెట్టలేమని అర్థమైంది. కుటుంబ సభ్యులు, దగ్గరి ఫ్రెండ్స్‌కి మాత్రమే చెప్పి చికిత్సకి రెడీ అయ్యారు.

శ్రీమతి కోసం
కీమో థెరపీ ప్రారంభమయ్యేప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి.. వెంట్రుకలు రాలుతాయి కాబట్టి ముందుగానే సీమ గుండు చేయించుకుంది. భార్యకు బాసలగా నిలిచేందుకు ఆమెకు మనోధైర్యం కలిగించేందుకు నితీన్‌ తాను కూడా గుండు చేయించుకున్నాడు. చికిత్స కొనసాగినన్ని రోజులు ఇద్దరు గుండుతోనే జీవితం గడిపారు.

గుండు ఎందుకంటే
భార్యభర్తలిద్దరు గుండుతో ఉండటం పట్ల నితిన్‌ కామత్‌ స్పందిస్తూ... క్యాన్సర్‌ పట్ల సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. బయటకి చెప్పకుండా లోలోపలే దాచుకోవడం సరికాదు. అందుకే నా భార్యకు ధైర్యం చెప్పడంతో పాటు సమాజంలో ఉన్న అపోహలు తొలగించాలని అనుకున్నాను. అందుకే ఆమెకు జుట్టు లేనన్ని రోజులు నాకు జుట్టు వద్దు అనుకున్నాను. గుండు చేయించుకున్నాను. మమ్మల్ని చూసి ఎవరైనా అడిగితే.. క్యాన్సర్‌ గురించి, చికిత్స పద్దతుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్‌గా చెబుతున్నాను అంటున్నాడు నితిన్‌ కామత్‌.

అపోహాలు పోవాలనే
ఇంత కాలం ఈ దంపతులు పరిచయం ఉన్న వారికే క్యాన్సర్‌ గురించి తెలుసు. అయితే ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డేని పురస్కరించుకుని సీమా తన ‍ క్యాన్సర్‌ స్టోరిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌ పట్ల అపోహలు తొలగి పోవాలనే ఈ స్టోరీ పోస్ట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో వీరి గుండు వెనుక రహస్యం బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సీమా పాటిల్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు