మార్కెట్‌లో లాభాలు.. అంతా ఆశామాషీ కాదు గురూ!

27 Jun, 2022 16:40 IST|Sakshi

వ్యాపారాలు ఆశాజనకంగా లేకపోవడం, బ్యాంకు వడ్డీరేట్లు సోసోగా ఉండటంతో ఇటీవల కాలంలో అనేక మంది ఇన్వెస్ట్‌ చేసేందుకు స్టాక్‌మార్కెట్‌ వైపు చూస్తున్నారు. ఇలా మార్కెట్‌లోకి వెళితే అలా సొమ్ము రెట్టింపు చేసుకోవచ్చన్నట్టుగా ఆత్మవిశ్వాసం చూపిస్తున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌ స్టాక్‌మార్కెట్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా ఫౌండర్‌ నితిన్‌ కామత్‌ కీలక సూచనలు చేశారు. 

స్టాక్‌మార్కెట్‌లో లాభాలపై నితిన్‌ కామత్‌ స్పందిస్తూ..  చాలా మంది సోషల్‌ మీడియా మాయలో ఉండిపోయి స్టాక్‌ మార్కెట్‌పై ఏవేవో అంచనాలు పెంచుకుంటున్నారు. స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలే లాభాలు అన్నట్టుగా ఊహించుకుంటున్నారు. కానీ వాస్తవం అలా ఉండదు. షేర్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం అంత సులభమైన పని కాదు’ అని తెలిపారు. షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో లాభాలు పొందడం అన్నది ప్రపంచంలో ఉన్న కష్టమైన పనుల్లో ఒకటని నితిన్‌ అన్నారు. 

గడిచిన కొన్ని నెలలలు మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా మార్కెట్‌లో లాభాలు తెచ్చుకోవడం అన్నది మరింత కష్టసాధ్యమైన పనిగా మారిందని నితిన్‌ అభిప్రాయపడ్డారు. బేర్‌ పంజా దెబ్బలకు మార్కెట్‌ విలవిలాడుతుంది. సాధారణంగా ‘లాంగ్‌’ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంటే ‘షార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మీద పెట్టుబడి పెట్టడం బెటరనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎదుగుదలకు చాలా సమయం పడుతుంది కానీ కుప్పకూలడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి. కానీ అదే పనిగా షార్ట్స్‌ మీద పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడం కూడా చాలా కష్టంగా ఉంది అంటూ ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను నూతన ఇన్వెస్టర్లకు వివరించే ప్రయత్నం చేశారు నితిన్‌ కామత్‌.

గతేడాది నవంబర్‌ నుంచి మార్కెట్‌లో అస్థితర రాజ్యమేలుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 62 వేల గరిష్టాలను టచ్‌ చేసి ఆరు నెలల వ్యవధిలోనే 52 వేల కనిష్టాలకు కూడా పడిపోయింది. నిఫ్టీ సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పేటీఎం, జోమాటో వంటి షేర్లు ఇన్వెస్టర్లకు రక్తకన్నీరు మిగిల్చాయి. ఇక బీరాలు పలుకుతూ వచ్చిప ఎల్‌ఐసీ ఐపీవో లిస్టింగ్‌ రోజునే ఢమాల్‌ అంది.

చదవండి: ఇలా చేయడం వల్లే ఆ కంపెనీకి ఎన్నడూ లేనన్ని లాభాలు!

మరిన్ని వార్తలు