పల్లెలో ఆటో నడిపిన సీఈవో.. ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆనంద్‌ మహీంద్రాకు సలహా

6 Dec, 2021 14:09 IST|Sakshi

వ్యాపారాల్లో పోటీతత్వం ఉంటుందని(ఉండాల్సిందే!), వ్యాపారుల మధ్య వైరం మాత్రమే ఉంటుందని అనుకోవడం సహజం. కానీ, ఈరోజుల్లో మార్కెట్‌ను పెంచుకోవాలన్నా, ప్రొడక్టులను ప్రమోట్‌ చేసుకోవాలన్నా ‘ఫ్రెండ్లీ నేచర్‌’ కచ్చితంగా ఉండాలని నిరూపిస్తున్నారు మన వ్యాపార దిగ్గజాలు. ఇందుకు సోషల్‌ మీడియానే వేదికగా మార్చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాప్ట్‌వేర్‌ ఐటీ కంపెనీ ‘జోహో కార్పొరేషన్‌’ సీఈవో శ్రీధర్‌ వెంబు, వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రాను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్లు చేశారు.


శ్రీధర్‌ వెంబు(53).. జోహో కార్పొరేషన్‌ సీఈవో.  తంజావూరు(తమిళనాడు)లో పుట్టిన శ్రీధర్‌.. జోహోతో పేరు ప్రఖ్యాతులు, పద్మశ్రీ అవార్డు సైతం సంపాదించుకున్నారు. అయితే  2019లో  టెంకాశీ పరిధిలోని మాతాలంపరై అనే కుగ్రామంలో సెటిల్‌ అయ్యారు. అప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పోస్ట్‌లన్నింటిని ఆయన ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడమే కాదు.. దానిని ఆయనే స్వయంగా ఆ పల్లెటూరిలో నడిపాడట. ఇంకేం ఆ అనుభవాన్ని ఇంటర్నెట్‌లో పంచుకోవడమే కాదు.. కంపెనీ యాజమాని ఆనంద్‌ మహీంద్రాకు కొన్ని ఫ్రెండ్లీ సలహాలు కూడా ఇచ్చారు శ్రీధర్‌. 

‘‘ఫుల్‌ఛార్జీతో 125కి.మీ. రేంజ్‌, గంటకు 55 కి.మీ.వేగంతో దూసుకుపోయే ఆటో ఇది. దీనిని నడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పల్లెటూరి రోడ్లకు సైతం తగ్గట్లుగా సౌకర్య వంతంగా ఉంది. పైగా సరసమైన ధరలో.. కుటుంబంతో సహా బయటకు వెళ్లడానికి ఎంతో అనుగుణంగా ఉంది ఇది. ఊళ్లో తిరుగుతున్న టైంలో చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుందని అడిగారు.  అందుకే ఆనంద్‌ మహీంద్రగారికి కొన్ని సలహాలు ఇవ్వదల్చుకున్నా... 

ఆనంద్‌ మహీంద్రా గారూ.. Mahindra treoలోనే  వెరైటీ డిజైన్లను, కలర్స్‌ను తీసుకు రండి. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్‌ ఈవీను ప్రచారం చేస్తే.. కచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది. ఇదే మీకిచ్చే సలహా’ అంటూ  ఈ ఉదయం(సోమవారం) ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు శ్రీధర్‌. అంతేకాదు ఈ ఆటోపై అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్లకు సమాధానం ఇవ్వడంతో పాటు పలువురి అనుమానాల్ని సైతం ఓపికగా నివృత్తి చేశారాయన.

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా, శ్రీధర్‌ వెంబు ట్వీట్లపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఈవీ ఆటోరిక్షా పూర్తి స్వదేశీ ఉత్పత్తి. ధర 3.5 లక్షల లోపే ఉంది. ఫీచర్లపై ప్రతికూల రివ్యూలు ఉన్నా.. గతుకు రోడ్లు, ఎత్తుపల్లాలపై దూసుకుపోయే కెపాసిటీ ఉందన్న రివ్యూలు దక్కించుకుంది. కిందటి ఏడాది భారత్‌లో ఐదు వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది ఏకైక ఈ-ఆటో కూడా ఇదే!. 

చదవండి: ఇది మరో ప్యాండెమిక్‌.. వ్యాక్సిన్‌ కూడా లేదు-ఆనంద్‌ మహీంద్రా 

మరిన్ని వార్తలు