జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! సాధ్యమంటోన్న కంపెనీ సీఈవో

22 Mar, 2022 15:58 IST|Sakshi

పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ  అందించేందుకు సిద్దంగా ఉన్నామని జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా  కంపెనీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ చేసే డెలివరీ బాయ్స్‌ పరిస్థితి ఏంటని ట్విటర్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పది నిమిషాల డెలివరీ వ్యవహారం పార్లమెంట్‌లో చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం నిప్పులు చెరిగారు. సదరు కంపెనీలు వేగంగా డెలివరీ చేసే మోజులో పడ్డాయని, డెలివరీ బాయ్స్‌ భద్రత గురించి కంపెనీలు పట్టించుకోవడం లేదంటూ పార్లమెంట్‌లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ స్పందించారు. 

10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమే..! 
సోషల్‌మీడియాలో నెటిజన్లు లేవనెత్తిన ప్రశ్నలకు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా పది నిమిషాల్లో డెలివరీ సాధ్యమంటూ పేర్కొన్నారు. జొమాటో ఇన్‌స‍్టంట్‌  సేవల్లో భాగంగా డెలివరీ బాయ్స్‌కు ఎలాంటి ఆటంకాలు రావని, వారి భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొన్నాడు.

►  జొమాటో ఇన్‌స్టంట్‌ సేవల్లో భాగంగా 10 నిమిషాల డెలివరీ సర్వీస్...నిర్దిష్ట ప్రాంతాల్లో ఎక్కువగా జనాదరణ పొందిన, ప్రామాణిక ఫుడ్‌ ఐటమ్స్‌ రెండు నిమిషాల్లో రెడీ అయ్యే వాటిని మాత్రమే డెలివరీ చేస్తామని తెలిపారు. 

ఇక ఆలస్యమైన డెలివరీలపై ఎలాంటి జరిమానాలు లేవు. 10 నుంచి 30 నిమిషాల డెలివరీలకు  ఎటువంటి ప్రోత్సాహకాలు లేవంటూ గోయల్‌ పేర్కొన్నారు. 

► పది నిమిషాల్లో డెలివరీ అందించేందుగాను కొత్త ఫుడ్‌ స్టేషన్లను నిర్మిస్తామని తెలిపారు.  వీటి సహాయంతో డెలివరీ వేగంగా అవుతుందని అభిప్రాయపడ్డారు. 

► డెలివరీ భాగస్వాములకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని, వారికి ప్రమాద, జీవిత బీమాను కూడా అందిస్తామని గోయల్ చెప్పారు.

► 10 నిమిషాల్లో తమ కస్టమర్లకు వెంటనే రెడీ అయ్యే.. "బ్రెడ్, ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ మొదలైన ఫుడ్‌ ఐటమ్స్‌ను డెలివరీ చేస్తామని గోయల్‌ తెలిపారు. 


చదవండి:  జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే

మరిన్ని వార్తలు