ఎంత మంచి వాడవురా... సిబ్బంది పిల్లల విద్య కోసం రూ. 700 కోట్లు

7 May, 2022 10:44 IST|Sakshi

జొమాటో సీఈవో గోయల్‌ ఉదారత 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్‌నర్స్‌ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ (జెడ్‌ఎఫ్‌ఎఫ్‌)కు 90 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్‌ను (స్టాక్‌ ఆప్షన్స్‌) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్‌ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్‌కు అందిస్తున్నట్లు గోయల్‌ తెలిపారు.

ఇద్దరు పిల్లలకు
గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్‌నర్స్‌గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్‌ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్‌లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్‌ పేర్కొన్నారు.   

చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!

మరిన్ని వార్తలు