జొమాటో నిధుల సమీకరణ జోరు

13 Feb, 2021 06:10 IST|Sakshi

తాజాగా చెల్లించిన మూలధనం మూడు రెట్లు పెంపు

పీఈ కంపెనీల నుంచి రూ. 1,800 కోట్ల పెట్టుబడులు!

ఐపీవోకు ముందు రూ. 44,000 కోట్లకు చేరిన కంపెనీ విలువ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టనుంది. ఈ ఏడాది జూన్‌కల్లా ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన పీఈ సంస్థలు మరోసారి వాటాలను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనీస్‌ దిగ్గజం యాంట్‌ గ్రూప్‌ జొమాటోలో వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఇటు పీఈ సంస్థల తాజా పెట్టుబడులు, అటు యాంట్‌ గ్రూప్‌ వాటా విక్రయం ద్వారా కంపెనీ 50 కోట్ల డాలర్ల(రూ. 3,650 కోట్లు) వరకూ సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. కాగా.. చెల్లించిన మూలధనాన్ని జొమాటో మూడు రెట్లు పెంచుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా 880 కోట్ల షేర్లను జారీ చేసినట్లు తెలుస్తోంది. వెరసి పెయిడప్‌ క్యాపిటల్‌ రూ. 535 కోట్ల నుంచి రూ. 1,448 కోట్లకు ఎగసినట్లు తెలియజేశాయి. తాజా పెట్టుబడుల నేపథ్యంలో జొమాటో విలువ 6 బిలియన్‌ డాలర్లకు(సుమారు రూ. 44,000 కోట్లు) చేరినట్లు అంచనా వేశాయి.  

వాటా విక్రయం
జొమాటోలో కొంత వాటా విక్రయం ద్వారా యాంట్‌ గ్రూప్‌ 25 కోట్లడాలర్లను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన పీఈ సంస్థలు ఐపీవోకు ముందే మరోసారి నిధులను అందించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా జొమాటో 25 కోట్ల డాలర్లను(రూ. 1825 కోట్లు) సమకూర్చుకోనున్నట్లు చెబుతున్నాయి. ఇన్వెస్ట్‌ చేయనున్న కంపెనీల జాబితాలో టైగర్‌ గ్లోబల్, కోరా ఇన్వెస్ట్‌మెంట్స్, ఫిడిలిటీ, స్టెడ్‌వ్యూ తదితరాలున్నాయి. దీంతో ఐపీవోకు ముందు కంపెనీ చేతిలో రూ. 7,300 కోట్ల నగదు చేరనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. జొమాటోలో దేశీ కంపెనీ ఇన్ఫోఎడ్జ్, యాంట్‌ గ్రూప్‌ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటాలు కలిగి ఉన్నాయి. ఐపీవో ద్వారా యాంట్‌ గ్రూప్‌ వాటాను విక్రయిస్తే.. కంపెనీలో ఇన్ఫోఎడ్జ్‌ అతిపెద్ద వాటాదారుగా నిలిచే వీలున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు