నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న జొమాటో

11 Feb, 2022 06:28 IST|Sakshi

క్యూ3లో రూ.67 కోట్లకు పరిమితం

ఫిట్సో వాటా విక్రయంతో రూ.316 కోట్లు

రెట్టింపైన ఆదాయం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నష్టం రూ.352 కోట్లుగా ఉంటే, తాజాగా అది రూ.67 కోట్లకు పరిమితమైంది. అయితే ఏ రూపంలో నష్టాలు తగ్గాయన్న? సందేహం రావచ్చు. కంపెనీ ఫిట్సో అనే ప్లాట్‌ఫామ్‌లో తనకున్న వాటాలను విక్రయించింది.

ఈ రూపంలో రూ.316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ.383 కోట్ల నష్టం కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్‌ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో 400 మిలియన్‌ డాలర్లు (రూ.3,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించింది. కస్టమర్‌ డెలివరీ చార్జీలు తగ్గించడం, కరోనా తర్వాత రీఓపెనింగ్‌ ప్రభావం, డెలివరీ నుంచి రెస్టారెంట్‌ డైనింగ్‌ అవుట్‌కు కొంత వ్యాపారం బదిలీ కావడం స్థూల ఆర్డర్‌ విలువ (జీవోవీ) వృద్ధి బలహీనంగా ఉండడానికి దారితీసినట్టు జొమాటో వివరించింది. జీవోవీ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం అధికంగా, సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే 1.7 శాతం పెరిగి రూ.5,500 కోట్లుగా ఉంది.  

మరింత విస్తరణే లక్ష్యం  
‘‘దీర్ఘకాలంలో ఫుడ్‌ ఆర్డర్, డెలివరీ వ్యాపారం వృద్ధి పట్ల పెద్ద అంచనాలతోనే ఉన్నాం. రెస్టారెంట్‌ పరిశ్రమలో మార్పులకు అందిస్తున్న సహకారం ద్వారా జొమాటో ప్రయోజనం పొందుతుంది’’ అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. మరిన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న తీరుపై స్పందిస్తూ.. తమ వ్యాపారం వృద్ధిని వేగవంతం చేసే వ్యాపారాల్లో మైనారిటీ వాటాల కొనుగోలుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ బ్యాలన్స్‌ షీటులో 1.7 బిలియన్‌ డాలర్లు ఉన్నాయని, నిధుల సమీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్‌ త్రైమాసికంలో అర్బన్‌పైపర్‌లో 5 మిలియన్‌ డాలర్లు, అడోన్మోలో 15 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. అంతకుముందు బ్లింకిట్‌ (గ్రోఫర్‌), షిప్‌రాకెట్, క్యూర్‌ఫిట్‌ తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు