‘జొమాటో చెప్పినట్లే చేస్తోంది’

12 Nov, 2022 08:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వాటాదారులకు చెప్పినట్టుగానే అడుగులు వేస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మరింత తగ్గించుకుని.. రూ.251 కోట్లకు పరిమితం చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.435 కోట్లతో పోలిస్తే సగం తగ్గినట్టు తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,024 కోట్లతో పోలిస్తే 60 శాతం పెరిగి రూ.1,661 కోట్లకు ఎగసింది. ఆగస్ట్‌ 10 నుంచి జొమాటో విలీనం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జొమాటో గణాంకాలను కూడా కలిపి చూస్తే ఆదాయం త్రైమాసికం వారీగా 16 శాతం పెరిగి, (వార్షికంగా 48 శాతం వృద్ధి) రూ.2,107  కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే బిలియన్‌ డాలర్ల (రూ.8,000 కోట్లు) ఆదాయ మార్క్‌ను మొదటిసారి ఓ త్రైమాసికంలో చేరుకున్నట్టు జొమాటో ప్రకటించింది.

‘‘దీర్ఘకాలం కోసం వ్యాపార నిర్మాణ క్రమంలో ఉన్నాం. దీర్ఘకాలం కోసం స్వల్పకాల అంచనాల విషయంలో రాజీపడడం, అవకాశాలను అంచనా వేయడం అన్నది ఎప్పటి మాదిరే కొనసాగుతుంది’’అని జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. మెరుగైన పనితీరు అంశంపైనా మాట్లాడారు. ‘‘చాలా విభాగాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద మొత్తంలో, వేగంగా డెలివరీ చేయాలి. కస్టమర్ల అభిప్రాయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే, రెస్టారెంట్‌ భాగస్వాములు, డెలివరీ భాగస్వాముల అభిప్రాయాలను కూడా తరచూ వినాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న నమూనాలను సవాలు చేస్తూ, మరిన్ని రిస్క్‌లు తీసుకోవాల్సి  ఉంది’’అని వివరించారు.  

బ్లింకిట్‌పై అభిప్రాయం మారుతుంది 
బ్లింకిట్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లింకింట్‌ వ్యాపారానికి సున్నా విలువ కడుతున్నారు. అది అర్థం చేసుకోతగినది. కొంత కాలానికి ఇది మారుతుందని నాకు నమ్మకం ఉంది’’అని గోయల్‌ వివరించారు. అన్ని ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం బ్లింకిట్‌కు నిలకడైన టీమ్‌ ఏర్పడిందని చెప్పారు. ఈ బృందం మంచి ఫలితాలను తీసుకొస్తున్నట్టు చెప్పారు.       

మరిన్ని వార్తలు