Zomato: అప్పుడు సూపర్‌ హిట్‌, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు

11 Aug, 2021 07:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో లిమిటెడ్‌ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్‌చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. 

ఈ క్యూ1లో గ్రోఫర్స్‌ ఇండియా లో 9.25%, హ్యాండ్స్‌ఆన్‌ ట్రేడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్‌ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్‌ఆన్‌ ట్రేడ్స్‌ ప్రైవేట్, గ్రోఫర్స్‌ ఇంటర్నేషనల్‌ తదితరాలతో డీల్‌ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. 

కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్‌ లను క్రియేట్‌ చేసింది. సబ్‌స్క్రిప్షన్స్ సైతం  గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్‌ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  
చదవండిబ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్‌

మరిన్ని వార్తలు