Zomoto: భోజన ప్రియులకు జోమాటో బంపర్‌ ఆఫర్‌..!

2 Aug, 2021 16:18 IST|Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో తన యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. యూజర్ల కోసం కొత్తగా మరో మెంబర్‌షిప్‌ను తొందరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో తన యూజర్ల కోసం ఇప్పటికే జోమాటో ప్రో పేరిట మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జోమాటో ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 మెంబర్‌షిప్‌ను తీసుకుంటే ఫుడ్‌ డెలివరీలపై 30 శాతం వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్‌ డైనింగ్‌లో 40 శాతం వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను అందిస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ గడువు 90 రోజులుగా ఉంటుంది.

తాజాగా జోమాటో తన యూజర్ల కోసం మరో సరికొత్త మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో ప్రో ప్లస్‌ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ మెంబర్‌షిప్‌లో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను యూజర్లకు జోమాటో అందించనుంది. అంతేకాకుండా ఎలాంటి సర్జ్‌ ఛార్జీలు, డిస్టాన్స్‌ ఛార్జీలు, అన్ని ప్రో మెంబర్‌షిప్‌ సేవలను జోమాటో అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్‌ కోసం జోమాటో ఒక చిన్న మెలిక పెట్టింది. ఈ మెంబర్‌షిప్‌ కోసం జోమాటో యాప్‌ ఈ రోజు(ఆగస్టు 2) సాయంత్రం ఆరు గంటలకు కొంతమంది యూజర్లకు మాత్రమే ఆహ్వానాన్ని పంపనుంది.

ఆహ్వానం వచ్చిన యూజర్లు సదరు అమౌంట్‌ను చెల్లించి జోమాటో ప్రో ప్లస్‌ మెంబర్‌షిప్‌ సేవలను పొందవచ్చును. జోమాటో ప్రో ప్లస్‌ మెంబర్‌షిప్‌ ధరలను ఇంకా ప్రకటించలేదు. జొమాటో 2008 లో ప్రారంభించగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కంపెనీ రూ. 8,250 కోట్ల వరకు ఐపీవోను దాఖలు చేసింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు